Vizag: మత్తు మాటలు.. చిక్కాక మత్తుమందు.. జెమీమా లీలలు బాబోయ్

|

Oct 18, 2024 | 9:48 PM

విశాఖ హనీట్రాప్ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. జెమీమా ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు. అయితే.. నిందితులు.. పథకం ప్రకారం మోసాలకు పాల్పడడంతో.. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు సీపీ శంకబ్రత బాగ్చి.

Vizag: మత్తు మాటలు.. చిక్కాక మత్తుమందు.. జెమీమా లీలలు బాబోయ్
Joy Jamima
Follow us on

హనీట్రాప్‌ కేసులో విశాఖ పోలీసులు కూపీ లాగుతూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లు.. లోకల్‌ నుంచి ఎన్‌ఆర్‌ఐల వరకు తన అందంతో వల వేసి డబ్బులు వసూలు చేసిన జాయ్‌ జమీమా కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు. దానిలో భాగంగా.. పలు కీలక విషయాలను రాబట్టారు. జెమీమా ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి కీలక ఆధారాలు సేకరించారు. బాధితులను భయపెట్టి, బెదిరించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బాధితులపై మత్తు మందు ప్రయోగించి.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు తేల్చారు విశాఖ పోలీసులు. హనీట్రాప్‌ కోసం ఓ ప్రత్యేక గ్యాంగ్‌ పని చేసిందని.. అందులో జమీమా పాత్ర స్పష్టంగా ఉందన్నారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి. మత్తు మందు ప్రయోగం చేసినట్లు ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేశారని.. కొందర్ని విపరీతంగా టార్చర్‌ చేశారని చెప్పారు. జెమీమా మాట విననివారిపై అత్యాచార కేసులు పెట్టిందని.. ప్రాణ భయంతో ఇద్దరు పారిపోయారని వెల్లడించారు. పథకం ప్రకారం బాధితుల నుంచి డబ్బులు లాగేశారని.. అయితే.. నిందితులకు మత్తు పదార్థాలు ఎవరు సరఫరా చేశారనే దానిపై కొంత సమాచారం అందగా.. దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాల్సి ఉందన్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు అవసరమైతే నిందితులను మరోసారి కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు సీపీ శంకబ్రత బాగ్చి.

మరోవైపు.. విశాఖ హనీట్రాప్ కేసులో బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి. ఇప్పటికే చార్జిషీట్‌ సిద్ధం చేశామని.. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.