
అందమైన సాగరతీరం ఆహ్లాదకరమైన వాతావరణం ఆర్కే బీచ్ సొంతం. అందుకే పర్యాటకులను ఇక్కడి ప్రకృతి సుందర దృశ్యాలు కట్టిపడేస్తుంటాయి. మెత్తటి ఇసుకతిన్నెల్లో నడుస్తూ.. చల్లని పిల్ల గాలులను ఆస్వాదిస్తూ.. కాలికి నెమ్మదిగా తాకుతున్న కెరటాలను చూసి ఫిదా అవక తప్పదు. కవ్వించే కెరటాలలో కొద్దిగా సరదాగా జలకలాడాలని అనుకుంటారు సందర్శకులు. కొన్ని సందర్భాల్లో అవే కెరటాలు అమాంతంగా తనలోకి లాగేస్తాయి. ఇటువంటి సందర్భంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తలెత్తుతోంది. పరిస్థితులు అర్థం చేసుకోక సముద్రంలో దిగి కెరటాల్లో కొట్టుకుపోతుంటారు సందర్శకులు. కొన్ని సందర్భాల్లో అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై రక్షిస్తారు. ఈరోజు ఆర్కే బీచ్ లో ఓ సందర్శకుడు కెరటాల్లో కొట్టుకుపోతూ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
విశాఖ ఆర్కే బీచ్ లో సందర్శకుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు.. ఆర్కే బీచ్ కి వెళ్ళాడు. అక్కడ కెరటాలలో జలకాలాడుతున్నాడు. ఒక్కసారిగా వచ్చిన రాకాసి కెరటం అమాంతంగా వెనక్కు లాగేసింది. దీంతో పట్టు తప్పిన ఈశ్వరరావు.. సముద్రంలో కొట్టుకుపోతున్నాడు. బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కెరటాల్లో చిక్కుకొని బయటపడలేకపోతున్నాడు.
అది గమనించి సమీపంలో ఉన్న లైఫ్‌గార్డ్స్ సకాలంలో స్పందించారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకారు. కెరటాల్లో కొట్టుకుపోతున్న ఈశ్వరరావును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సేఫ్గా రెస్క్యూ చేసి త్రీటౌన్ సీఐకి అప్పగించారు. సముద్ర స్నానాల ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు. సముద్ర అలల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అవగాహన లేకపోతే దిగకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..