Vizag Thalli flyover: మనుషులను మింగేస్తున్న మృత్యు మలుపు.. మరణ మృదంగం మోగిస్తున్న తెలుగుతల్లి ఫ్లైఓవర్‌..

విశాఖలో రైల్వే స్టేషన్, గాజువాక వైపు వెళ్లేందుకు.. అదే ప్రధాన రహదారి. అక్కడికే కాదు..మృత్యువు వైపు తీసుకెళ్లాలన్నా అదే ప్రధాన రహదారిగా మారింది. ఇప్పుడు యమదారిగా మారి వాహనదారులను భయపెడుతోంది. అదే విశాఖలో డెత్‌ బెల్స్‌ మోగిస్తున్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌. అసలు ఈ ఫ్లైఓవర్ ఎందుకింత డేంజర్‌గా మారింది?

Vizag Thalli flyover: మనుషులను మింగేస్తున్న మృత్యు మలుపు.. మరణ మృదంగం మోగిస్తున్న తెలుగుతల్లి ఫ్లైఓవర్‌..
Thalli Flyover In Vizag

Updated on: Oct 27, 2023 | 10:13 PM

విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ ఇప్పుడు వాహనదారులను వణికిస్తోంది. సిగ్నల్స్ బెడద లేకుండా నేరుగా వెళ్ళేందుకు ఆ ఫ్లైఓవర్‌ను వాహనదారులు ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు అదే ఫ్లైఓవర్ ప్రాణాలు తీస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ఈ ఫ్లైఓవర్ పై.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొంటే.. మరో యువకుడిని ఆసుపత్రి పాలు చేసింది.

2019 నుంచి డేటా తీసుకుంటే.. ఈ నాలుగేళ్ల కాలంలోనే.. వేర్వేరు ప్రమాదాల్లో 13 మందిని ఈ ఫ్లైఓవర్ బలి తీసుకుంది. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లైఓవర్‌ మీద ఉన్న మృత్యు మలుపే ఈ యాక్సిడెంట్లకు ప్రధాన కారణమంటున్నారు. వెహికల్స్‌ హై స్పీడ్‌తో వెళ్లడంతో పాటు ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు… ప్రమాదాలకు కారణామవుతున్నాయంటున్నారు పోలీసులు. ఈ విషయంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవీఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు ట్రాఫిక్ పోలీసులు లేఖ కూడా రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌….ఈ సమస్యను మరోసారి జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులకు సూచించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటున్నారు స్థానికులు.

ఫ్లైఓవర్ ఎత్తు పల్లాలుగా ఉండడంతో పాటు రైల్వే స్టేషన్ వైపు వెళ్లేటప్పుడు చిన్నపాటి మలుపు, ఆపై డౌన్ కూడా ఉంది. ఈ క్రమంలో హై స్పీడ్ గా వస్తున్న వాహనాలు ఆ మలుపు వద్ద అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇదే మృత్యు మలుపుగా మారింది. దీనికి తోడు మలుపు తిరుగుతున్న సమయంలో.. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పల్లం ఉండాల్సింది పోయి.. రైట్ సైడ్ టిల్ట్ ఉండడం… ఈ ప్రమాదాలకు ఒక కారణమని ట్రాఫిక్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు చెబుతున్నారు. జీవీఎంసీ అధికారులు ఇన్‌స్పెక్షన్‌ చేసినా…శాశ్వత నివారణ చర్యలు చేపట్టలేదు. వాహనదారుల స్పీడుకు పోలీసులు కళ్లెం వేయగలరు కానీ…ఇంజినీరింగ్‌ లోపాలను వాళ్లు సరిచేయలేరు. జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం శాశ్వత చర్యలు తీసుకుంటేనే ఈ ఫ్లైఓవర్‌పై మరణ మృదంగానికి అడ్డుకట్ట పడుతుందంటున్నారు స్థానికులు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us