విశాఖపట్నంలోని భీమిలీ బీచ్‌లో ఆదివారం (ఏప్రిల్ 9) రాత్రి వింత వెలుగులు కనిపించాయి. విశాఖ తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులను కనువిందు చేశాయి. సముద్రం ఒడ్డున తీరానికి చేరుకునే అలలు వెన్నెల కాంతుల్లో నీలం రంగులో మెరిసిపోయాయి. ఎన్నడూ లేనిది సముద్రం అలలు నీలం రంగులో మెరిసిపోవం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మరింది. అలలు తాకిన ప్రదేశం కూడా నీలంగా మారిపోవడం సందర్శకులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి 8 గంటల తరువాత విశాఖ-భీమిలీ బీచ్‌లో ఈ వింత వెలుగు కనిపించింది. తీర ప్రాంతం పొడవునా అదే తరహా కాంతులు కనిపించాయి. ఈ వింతను తిలకించడానికి విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో తీర ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు వీడియోలు సైతం తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ సమయంలో సముద్రం మీదుగా వీచే గాలుల్లో కూడా అసాధారణంగా ఉన్నట్లు సందర్శకులు చెబుతున్నారు. కొద్దిసేపు చల్లగా, మళ్లీ క్షణాల్లోనే వేడిగా గాలులు వీచాయని చెప్పుకొచ్చారు. ఇలా ఎప్పుడూ జరగలేదని సందర్శకులు వెల్లడించారు. నిజానికి సముద్ర జలాల్లో చేపలు, నత్తలు, పీతలతోపాటు యాల్జీ, జెల్లిఫిష్ వంటి ఇతర జీవులు కూడా నివసిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో బయోలూమినెస్సీన్స్ అనే సముద్ర జీవుల వల్ల సముద్రం నీలం రంగును సంతరించుకుని ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వాతావరణంలో చోటు చేసుకునే పెను మార్పుల వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. సాధారణంగా ఇలాంటి వింత దృశ్యాలు ప్యూర్టోరికో, శాన్ డియాగో, ఫ్లోరిడా, జపాన్ తీర ప్రాంతాల్లో తరచూ కనిపిస్తుంటాయి. 2019లో ఇదే విధమైన నీలం రంగు కాంతులు చెన్నై తీరంలో ఏర్పడ్డాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అండమాన్, పశ్చిమబెంగాల్, లక్షద్వీప్ సముద్ర తీరాల్లోనూ ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు కనువిందు చేస్తుంటాయి. తాజాగా విశాఖపట్నం-భీమిలీ తీరంలో కూడా నీలం కాంతులు కనిపించడంతో నగర వాసులు కొంత ఆశ్చర్యంతోపాటు, భయాందోళనలకు గురవుతున్నారు.
Rare Bioluminescence phenomenon spotted at #Vizag Bheemili Coast ?? pic.twitter.com/ZQ1THAJUgv
— Vizag Weatherman (@VizagWeather247) April 8, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.