
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బందబయలులో మొసలి కలకలం సృష్టించింది. వాగు ఒడ్డున మొసలి ప్రత్యక్షమైంది. చేపల వేటకు వెల్లిన వాళ్ళకు మొసలి కనిపించడంతో కలకలం రేగింది. ఫోటోలు తీసి వైరల్ చేయడంతో పరిసర గ్రామాల గిరిజనులు హడలెత్తిపోయారు. ఆ వాగునుంచే పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. తుఫాన్ వరదలకు మొసలి ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాగులో ముసలి ప్రత్యక్షమవడంతో.. ఆందోళనలో పడ్డారు స్థానికులు.
తోలుత ఆ మొసలి రాయిలా కనిపించింది. వాగు గట్టు పైకి వచ్చి సేదతీరుతున్న మొసలిని చేపల వేటకు వెళ్లిన కొందరు స్థానికులు ఫోటోలు తీశారు. అనంతరం ఆ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. బంధబయలు నుంచి బోనకలమామిడి గ్రామాల మధ్య ఉన్న ఈ వాగుకు అవతలి వైపు బెన్నవరం, నక్కబొక్కల కొత్తూరు, బోనకలమామిడి, పోతురాజుగుమ్మాలు తదితర గ్రామాలు ఉన్నాయి.
ఆయా గ్రామాల ప్రజలు నిత్యం ఈ వాగు దాటుతూ రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల తుపాన్ల వరద ప్రవాహానికి మొసలి కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే వాగులో భారీ మొసలి కనిపించడంతో పరిసర గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే.. వాగు దాటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.