చిన్నారి సుమేధకు కన్నీటి వీడ్కోలు

| Edited By:

Sep 19, 2020 | 10:18 AM

చిన్నారి సుమేధ అంత్యక్రియలు ముగిశాయి. తమ గారాలపట్టి సుమేధ తమను వదిలి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు ఈఘటనపై బాలిక తండ్రి అభిజిత్‌ కపూరియా హైకోర్టులో పిటిషన్‌ వేస్తానంటున్నారు.

చిన్నారి సుమేధకు కన్నీటి వీడ్కోలు
Follow us on

ఆడుకోవాడానికి వెళ్లి నాలాలోపడి చనిపోయిన చిన్నారి సుమేధ అంత్యక్రియలు ముగిశాయి. ఇంటి నుంచి కైలాస వైకుంఠ వాహనంలో సుమేధ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్ సమీపంలోని పటేల్‌నగర్‌ స్మశాన వాటికలో సుమేధ అంత్యక్రియలు జరిగాయి. తమ గారాలపట్టి సుమేధ తమను వదిలి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను వెల్లడించారు అధికారులు.. ఆడుకుంటూ నాలాలో పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలిందని, దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, నాలాలో పడ్డ తరువాత ఊపిరితిత్తులలో నీరు చేరి శ్వాస ఆడక చనిపోయినట్టు రిపోర్ట్‌లో వెల్లడించారు.

అమ్మా… కాసేపు ఆడుకొని వస్తానని తల్లికి చెప్పిందా చిన్నారి. సరదాగా బయటికి వెళ్లింది. ఇక ఎప్పటికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోయింది. నోరు తెరిచిన ఓపెన్‌ నాలా ఆ బాలికను మింగేసింది. అధికారుల నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది. ఆడుకోవడానకి వెళ్లి అదృశ్యమైన బాలిక చివరకు చెరువులో శవమై తేలింది. కనిపించ కుండా పోయిన పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో బాలిక విగతజీవిగా కనిపించింది.

ప్రైవేట్‌ ఉద్యోగి అభిజిత్‌ కపూరియా, సుకన్య దంపతులు రెండు నెలల కిందటే కాకతీయనగర్‌ నుంచి దీనదయాళ్‌నగర్‌కు మారారు. వీరికి కూతురు సుమేధ, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు సుమేధ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లిన చిన్నారి రాత్రి 7గంటలు కావస్తున్నా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు కాలనీలో వెతికారు. సుమేధ ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వారిని అడిగినా జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలోని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రమాదవశాత్తు కూతురు నాలాలో పడిపోయిందా? అనే అనుమానం కలిగింది. బాలిక అదృశ్యమైన విషయం స్థానికులకు తెలియడంతో వారూ తల్లిదండ్రులతో కలిసి వెతకడం ప్రారంభించారు. మూడు గంటల పాటు గాలించినా జాడ తెలియలేదు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటలకు కాలనీకి చేరుకొని అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రెస్క్యూ బృందం వచ్చి గాలింపు మొదలుపెట్టింది. కాలనీలోని మురుగునీరు వెళ్లే నాలాలో రెస్క్యూ బృందం వెతుకుతుండగా సుమారు రెండు కి.మీ.దూరంలో ఉన్న బండచెరువు వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందానికి బాలిక సుమేధ విగతజీవిగా లభించింది.

తన కూతురు మరణానికి కారణం ఎవరని సుమేధ తండ్రి అభిజిత్‌ కపూరియా ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు ఈఘటనపై బాలిక తండ్రి అభిజిత్‌ కపూరియా హైకోర్టులో పిటిషన్‌ వేస్తానన్నారు.