Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో అదిరే శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఈ కాలేజీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..
Ap Government

Updated on: Feb 09, 2026 | 10:50 PM

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీని కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి ఉండగా.. దీనిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనేకసార్లు డిమాండ్లు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎంప్లాయిస్‌మెంట్ స్టేట్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 10 ఈఎస్‌ఐ లేదా ఈఎస్‌ఐఎస్ కాలేజీలను మెడికల్ ఆస్పత్రులుగా మార్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో విశాఖపట్నంకు కూడా స్థానం లభించింది.

ఈఎస్‌ఐసీ చేతికి అప్పగింత

విశాఖపట్నంలో అస్పత్రిని ఈఎస్‌ఐసీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర కార్మిక సహాయమంత్రి శోభా కరంద్లాజే స్పష్టం చేశారు. జాతీయ వైద్య మండలి విధానాలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అప్పగించిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుందని అన్నారు. ప్రస్తుతం అప్పగించే ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ అప్‌గ్రేడేషన్ పనుల కోసం జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ బృందం విశాఖలోని ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రిని ఇప్పటికే పరిశీలించింది.

అప్పగించే ప్రక్రియ షురూ

ఇక కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం షురూ చేసింది. స్టాఫ్, నిర్వహణ ఖర్చులు, ఇతరత్రా అంశాలపై కేంద్రంతో రాష్ట్రం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి 200 పడకల సామర్థ్యంతో కొనసాగుతోంది. దీనికి మెడికల్ కాలేజీగా మార్చడం వల్ల వాణిజ్య నగరమైన విశాఖపట్నంలో వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయి. అటు షీలా నగర్‌లో 400 పడకలతో ఈఎస్‌ఐసీ హాస్పిటల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.