AP Cyclone Alert: ఉత్తరాంధ్రకు మరో తుఫాను గండం.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

North Andhra Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ లో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడింది.

AP Cyclone Alert: ఉత్తరాంధ్రకు మరో తుఫాను గండం.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన
Ap Cyclone Alert

Updated on: Dec 02, 2021 | 5:25 PM

ఉత్తరాంధ్రకు మరో తుఫాను గండం పొంచి ఉంది.  ఐఎండీ సమాచారం మేరకు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ లో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడింది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ మరియు తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా పయనించి శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

రేపు(శుక్రవారం) అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ, శనివారం ఉదయం 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read..

Omicron Variant: భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్.. బెంగళూరులో రెండు కేసులు నమోదు..

Corona Kavach: ఒమిక్రాన్ వణికిస్తోంది.. కరోనా సోకితే ఈ పాలసీతో వైద్య ఖర్చులకు ఇబ్బంది ఉండదు.. ఎలానో తెలుసుకోండి!