ఏంటి.! టైటిల్ చూసి షాక్ అయ్యారా.! టెన్షన్ వద్దు.. స్టోరీలోకి వెళ్లండి అసలు విషయం మీకే తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో మరోమారు పాము కలకలం రేపింది. పుట్టపర్తిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దూరిన విష సర్పం స్థానికుల్ని హడలెత్తించింది. లిఫ్ట్ లోకి దూరిన ప్రమాదకర రక్తపింజర హల్‌చల్ చేసింది. పాము భయంతో అపార్ట్‌మెంట్ వాసులు హడలిపోయారు. భయంతో పరుగులు తీశారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని సాయి భాను అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో అర్ధరాత్రి ప్రమాదకరమైన రక్తపింజర పాము దూరి కలకలం సృష్టించింది. లిఫ్ట్‌లోకి దూరిన పాము కదలకుండా అక్కడే తిష్ట వేయడంతో జనం భయాందోళనకు గురయ్యారు. తొలుత పాము ఉందన్న విషయం తెలియక కొందరు లిఫ్ట్‌లోకి వెళ్లి పామును చూసి హడలిపోయారు. పాము ఎంతసేపటికి అక్కడి నుంచి కదలకపోవడంతో హడలిపోయిన అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్ మూర్తికి అందించారు.
కాగా, అక్కడికి చేరుకున్న అతడు చాకచక్యంగా పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పుట్టపర్తి నడి పట్టణంలో గల అపార్ట్‌మెంట్‌లోకి ప్రమాదకరమైన రక్తపింజరి రావడం చర్చనీయాంశంగా మారింది. రక్తపింజరి చాలా ప్రమాదకరమైన పాము అని, కాటువేస్తే క్షణాల్లో మనిషి మృతి చెందే అవకాశాలు ఉంటాయని స్నేక్ క్యాచర్ చెబుతున్నారు.