
సోహిత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాడేపల్లి మండలం ప్రాతూరుకు చెందిన సోహిత్ విజయవాడ వచ్చి వెళ్తుంటాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విజయవాడ నుండి సొంతూరు ప్రాతూరుకు కు బైక్ పై బయలు దేరాడు. కరకట్టపై వెలుతున్న సోహిత్ ను విజయవాడ క్లబ్ దాటిన తర్వాత ఒక వ్యక్తి లిఫ్ట్ కావాలని అభ్యర్ధించాడు. దీంతో సోహిత్ బైక్ స్లో చేశాడు. అతను బైక్ ఎక్కుతుండగా మరో నలుగురు యువకులు సోహిత్‌ను చుట్టుముట్టారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తన వద్ద నగదు లేదు అని చెప్పడంతో ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు. మొబైల్ ను ఓపెన్ చేయించి 30 వేల రూపాయలను ఫోన్ పే చేయించుకున్నారు.
ఆ తర్వాత అతని వద్ద ఏటిఎం కార్డులు ఇవ్వాలని పట్టుబట్టారు. కార్డు ఇచ్చిన తర్వాత పిన్ నంబర్ చెప్పాలన్నారు. పిన్ నంబర్ చెప్పకపోవడంతో సోహిత్ బైక్ పై ఎక్కించుకున్న ఇద్దరు దుండగులు ఏటిఎం వద్దకు తీసుకెళ్లారు. ఏటిఎం నుండి 35 వేల రూపాయలు డ్రా చేసుకున్నారు. అంతటితో వదిలి పెట్టకుండా రెండు గంటల పాటు సోహిత్ ను వేధించారు. ఐదుగురు వ్యక్తులుండటంతో సోహిత్ కూడా ప్రతిఘటించలేకపోయాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సోహిత్ ను వదిలి పెట్టారు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ సోహిత్ తన స్వగ్రామం చేరుకొని తన బంధువులకు విషయం చెప్పాడు. బుధవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు.
సోహిత్ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఫోన్ పే నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు విజయవాడ రాణిగారితోటకు చెందిన వారుగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సిఐ వీరేంద్ర కుమార్ సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. కరకట్ట మీద దారి దోపిడీలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.