
జగ్గయ్యపేట కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన విజయం సాధించారు. 31వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఆమె తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఈ ఫలితం వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన ఎన్నికల బరిలో నిలవడం స్థానికంగా ఆసక్తి కలిగించింది. జనసేన పార్టీ తరఫున 31వ వార్డు నుంచి పోటీ చేసిన ఆమె ఓట్ల లెక్కింపులో ఆధిక్యం కనబరిచి విజయాన్ని అందుకున్నారు.
మేఘన గెలుపు వార్త వెలువడటంతో జనసేన పార్టీ శ్రేణులు, కూటమి అభిమానులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితంతో జగ్గయ్యపేటలో జనసేన శ్రేణుల్లో సందడి నెలకొంది.
కాగా వాసిరెడ్డి పద్మ.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గయ్యపేట టికెెట్ ఆశించారు. పార్టీ హైకమాండ్ అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.
.