Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే..

డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. ప్రజలు మళ్లీ మోసపోతూనే ఉన్నారు.. చేసిన పేమెంట్ పూర్తిగా అయ్యిందా లేదా అని నిర్ధారించుకోకుండా నష్టపోతున్నారు. ముఖ్యంగా UPI చెల్లింపుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్‌తో చాలా మంది వ్యాపారులు డబ్బులు కోల్పోతున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. యూపీఐ చేశానంటూ.. ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేల కుచ్చుటోపి పెట్టాడు.

Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే..
Upi Fraud Hindupur

Edited By:

Updated on: Jun 14, 2026 | 11:01 AM

యూపీఐ చేశానంటూ ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేలు కుచ్చుటోపి పెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బియ్యం దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి 10 బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించకుండా యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లించాడు. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్‌ను బియ్యం వ్యాపారికి చూపించి, రైస్ బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితే మరుసటి రోజు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ పరిశీలించిన వ్యాపారికి, కస్టమర్ పంపిన రూ.10 వేలు క్రెడిట్ అయినట్టు చూపించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బియ్యం వ్యాపారి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని మొత్తం పోలీసులకు వివరించాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాప్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి అందులో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

తాజా ఘటన నేపథ్యంలో నగరంలోని వ్యాపారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. రోజురోజుకూ డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయని.. మనం అప్రమత్తంగా ఉంటేనే వీటిని అరికట్టవచ్చని తెలిపారు. టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వాడుకొని UPI ద్వారా అమౌంట్ చెల్లించకపోయినా.. చెల్లించినట్లు సక్సెస్‌ఫుల్ మెసేజ్ చూపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని.. కాబట్టి ప్రతి వ్యాపారి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, డబ్బులు వచ్చాయా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే వాళ్లను పంపాలని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us