ఏపీలో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇలాకాలో ఏకగ్రీవాల జోరు

| Edited By: Sanjay Kasula

Feb 13, 2021 | 7:13 AM

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియగానే ఏకగ్రీవాల లిస్ట్‌ బయటికొస్తోంది...

ఏపీలో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇలాకాలో ఏకగ్రీవాల జోరు
Follow us on

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియగానే ఏకగ్రీవాల లిస్ట్‌ బయటికొస్తోంది. రెండో విడతకంటే ఎక్కువగానే పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు శనివారం రెండోవిడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో పదులసంఖ్యలో పంచాయతీలకు ఎన్నికలు లేవు. ప్రత్యర్థులు, ప్రచారాలు ఏవీ లేవు. ఏపీలో ఏకాభిప్రాయంతో పంచాయతీ మూడో విడతలోనూ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి. లెక్క కొలిక్కివచ్చేసరికి ఏకగ్రీవాలు…రెండో విడత సంఖ్యని మించిపోయేలా ఉన్నాయి.

ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాల్లో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా అన్ని పంచాయతీలకు పోటీ లేదు. మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో 21 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రకాశం జిల్లాలో 69 పంచాయతీలు, శ్రీకాకుళంలో జిల్లాలో 45 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో… అప్పటి వరకు దాఖలైన నామినేషన్ల ఆధారంగా ఏకగ్రీవాల్ని ప్రకటించారు అధికారులు.

తొలివిడతలో 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు విడతల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. మూడో విడతలోనూ అధికార పార్టీ అభ్యర్థులే ముందున్నారు. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై టీడీపీ అనుమానం వ్యక్తంచేస్తోంది. అటు హైకోర్టు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై జోక్యంచేసుకుంది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఏకగ్రీవాల ప్రకటనలు, వివాదాలు కొనసాగుతుండగానే.. ఏపీలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలదాకా పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలోని 167 మండలాల్లో… 2వేల 786 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించి..సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల వెల్లడి తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రెండవ విడతకి మొత్తం 3వేల 328 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. మొత్తం 539 సర్పంచ్‌ స్థానాలు, 12వేల 604 వార్డులు రెండో విడతలో ఏకగ్రీవమయ్యాయి. అటు.. నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 17న మూడో విడత, 21న నాలుగోవిడత పోలింగ్‌ జరగబోతోంది.

Read also : చిక్కుల్లో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, ఐపీసీ 448, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు