పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ దున్నపోతే ఆ రెండు గ్రామాల మధ్య గొడవకు కేంద్రమైంది. అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలోని అంబాపురం, రచ్చుమర్రి గ్రామాల్లో ఐదేళ్లకోసారి ఊరి జాతర జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఊరి దేవర జరిగిన నెల తర్వాత అమ్మవారి పేరున మూడు నెలల దున్నపోతును కొనుగోలు చేసి గ్రామం మీద వదులుతారు. ఐదేళ్ల క్రితం ఈ రెండు గ్రామాల్లో ఊరి దేవర ముగిసిన తర్వాత మళ్లీ దున్నపోతును అమ్మవారి పేరున వదిలేశారు. తాజాగా ఈ రెండు గ్రామాల్లో ఊరి జాతరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
ఈనెల 17వ తేదీన కనేకల్లు మండలం అంబాపురం గ్రామం కొల్లారమ్మ జాతర జరగనుంది. ప్రతి ఐదేళ్లకోసారి ఈ జాతరలో అమ్మవారికి దున్నపోతును బలి ఇవ్వడం ఆచారం అయితే అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కనిపించకపోవడంతో నెల రోజులుగా అంబాపురం గ్రామస్తులు వివిధ ప్రాంతాల్లో వెతికారు చివరకు బొమ్మనహల్ మండలం కొలగానహళ్ల్ లో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లి గ్రామంలో కట్టేశారు. ఇదే సమయంలో రచ్చుమర్రి గ్రామస్తులు ఆ దున్నపోతు తమదేనంటూ…వాగ్వాదానికి దిగారు.
వారం రోజులుగా ఆ దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం చెల్లరేగుతూ వస్తుంది. ఇరు గ్రామాల పెద్దలు పట్టుదలకు పోవడంతో ఆ దున్నపోతు ఎవరికి వారు తమదేనంటూ పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా పెట్టారు. అయినా ఎవరూ రాజీపడటం లేదు. జాతర తేదీ దగ్గర పడుతుండడంతో ఊరంతా సంబరాలకు సిద్ధమైన సమయంలో ఇలా ఘర్షణకు దిగడం సరికాదు అంటున్నారు అంబాపురం వాసులు.
రచ్చుమర్రి వాసులు రెండు దున్నపోతులను వదిలారు. ఐతే ఈ యేడాది ఒక దున్నపోతు కనిపించకపోవడంతో దానికోసం వెతికారు. అంబాపురంలో ఉన్న దున్నపోతు తమదేనని రెండు గ్రామాల మధ్య పోరు మొదలైంది. అయితే ఈ దేవర దున్నపోతును వదులుకుంటే మరో రెండు నెలల్లో తమ గ్రామంలో జాతర ఎలా జరుపుకోవాలంటూ రచ్చుమర్రి గ్రామస్తులు నిలదీస్తున్నారు. చివరకు దేవరపోతు సమస్య కనేకల్లు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. రెండు గ్రామాల పెద్దల మధ్య సఖ్యత కుదుర్చేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇరుగ్రామాల ప్రజలు రాజీకి రావాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..