
తిరుపతి, నవంబర్ 10: టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు. అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు. నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. ఈ వ్యవహారం కాస్తా టిటిడి యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. స్పందించిన టీటీడీ ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది.
రామస్వామి, నరసమ్మ అనే టిటిడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నట్లు గుర్తించింది. ఇద్దరి పైనా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.