Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!

పార్వతీపురం మన్యం జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నిమ్మక రూప (14) అనే బాలిక అనారోగ్యంతో మృత్యువాత పడింది. సకాలంలో వైద్యం అందక హాస్పిటల్‌కు చేరేలోపే చిన్నారికి తుదిశ్వాస విడిచింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుముననీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
Andhra Pradesh Hostel Tragedy

Edited By:

Updated on: Feb 08, 2026 | 11:40 PM

గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న రూపను ఫిబ్రవరి 3 తేదీన తేదీన నీలకంఠాపురంలో ఉన్న పిహెచ్ సి కి తరలించి చికిత్స అందించారు. అక్కడ జ్వరం తగ్గక పోవడంతో మూడు రోజుల తరువాత అక్కడ నుంచి కురుపాం సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే మరింత అనారోగ్యానికి గురై జ్వరంతో పాటు ఫీట్స్ కూడా వచ్చాయి. దీంతో అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు కుటుంబసభ్యులు. చివరిగా కేజీహెచ్‌లోనే చికిత్స పొందుతూ రూప తుదిశ్వాస విడిచింది.

ఇటీవల కాలంలో గిరిజన ఆశ్రమాల్లో బాలికలు తరుచూ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆవేదన చెందుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల పర్యవేక్షణ, వైద్య సేవలపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యమే ఈ తరహా ఘటనలకు కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా సకాలంలో గుర్తించకపోవడం, ఆసుపత్రులకు ఆలస్యంగా తరలించడం వంటి లోపాలు వల్లే గిరిజన బాలబాలికలు పిట్టల్లా రాలుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తలెత్తి ఇలాంటి ఘటనలు తరుచూ తలెత్తుతున్నా వాటిని కట్టడి చేయడంపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల మృత్యువాతలు కొనసాగుతున్నాయి.

తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎంతో ఆశతో ఆశ్రమాలకు పంపుతున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. పిల్లలకు సరైన సంరక్షణ, పోషకాహారం, వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జరిగిన ఘటన రూప కుటుంబాన్ని దుఃఖంలో ముంచితే, ఆశ్రమాల్లో జరుగుతున్న పరిస్థితులు, అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలు అయ్యింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us