
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం ఉందన్నారు. చాలా టైమ్ ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని సూచించారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. పార్టీ గెలుపే అజెండాగా పనిచేయాలంటూ ప్రతి నేతకూ.. ప్రతి కార్యకర్తకూ సూచిస్తున్నారు సీఎం జగన్. నియోజకవర్గాల వారీగా రివ్యూలో భాగంగా.. బాపట్ల జిల్లా అద్దంకి నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. 175 సీట్లే లక్ష్యంగా పని చేయాలన్నారు. అద్దంకిలో ఖచ్చితంగా విజయం సాధించాలన్నారు. సాధ్యం కాదు అనే పదం ఉండకూడదని.. అందరం కలిసి పని చేస్తే 175 సీట్లు కచ్చితంగా వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్.
ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పని చేయాలని సూచించారు. నేను చేయాల్సిన పని చేస్తున్నా. డైరెక్ట్‌గా లబ్ధిదారులకే స్కీమ్‌లు చేరవేస్తున్నా.. మీరు ప్రతి ఇంటికీ వెళ్లి చేసిన పని చెప్తే చాలన్నారు. గడప గడపకూ వెళ్లి.. చేసిన మంచిని చెప్పాలన్నారు సీఎం జగన్.
డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో అద్దంకి నియోజకవర్గానికే 1,081 కోట్ల సాయం అందింది. 93 వేల 124 కుటుంబాలకు లబ్దిచేకూరింది. అంటే నియోజకవర్గంలో 87 శాతం ఇళ్లకు మంచి చేశామన్నారు.
వివక్ష, లంచాలకు తావు లేకుండా సాయం చేశాం.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు ఇచ్చాం. మనకు ఓటు వేసినా వేయకపోయినా సాయం చేశామన్నారు. అభివృద్ధి అంతా కళ్ల ముందే కనిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా పాలన అందిస్తున్నాం. అందుకే కుప్పంలోనూ క్లీన్‌స్వీప్ చేశామన్నారు సీఎం జగన్. అలాగే అద్దంకిలో కూడా అందరూ కలిసి పనిచేస్తే పార్టీ విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం