అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు!

గత పది రోజులుగా ఏలూరు జిల్లా ప్రజలను, అటవీశాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న పెద్దపులి మరోసారి చిక్కకుండా తప్పించుకుంది. బుట్టాయగూడెం మండలం కామవరం పరిసరాల్లో పశువులపై దాడి చేసిన పులిని పట్టుకునేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో వలలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. అర్ధరాత్రి సమయంలో అధికారుల కళ్ల ముందే వల నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయింది.

అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి.. వల నుంచి తప్పించుకుని పరుగులు!
Tiger Escapes Forest Department Trap

Edited By:

Updated on: Aug 08, 2026 | 11:48 AM

గత పది రోజులుగా ఏలూరు జిల్లా ప్రజలను, అటవీశాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న పెద్దపులి మరోసారి చిక్కకుండా తప్పించుకుంది. బుట్టాయగూడెం మండలం కామవరం పరిసరాల్లో పశువులపై దాడి చేసిన పులిని పట్టుకునేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో వలలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. అర్ధరాత్రి సమయంలో అధికారుల కళ్ల ముందే వల నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ పులి ఆంధ్ర – తెలంగాణ సరిహద్దుల వైపు కదులుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ఏలూరు జిల్లా పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కొద్ది రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా కామవరం గ్రామానికి చెందిన రైతు మడివి కృష్ణకు చెందిన ఆవు, గిత్తదూడపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతో పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

పశువులపై దాడి అనంతరం సమీపంలోని జామాయిల్ తోటలో పులి నక్కి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బందితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. తోట చుట్టూ వలలు ఏర్పాటు చేసి, అవసరమైతే మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే రాత్రి సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పులి.. అధికారుల వలలను దాటుకుని తప్పించుకుంది.

మరోవైపు డ్రోన్ కెమెరాలతో నిర్వహించిన గాలింపులో పులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు రికార్డైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి తెలంగాణ వైపు కదులుతున్నట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. అశ్వారావుపేట మండలంలోని కవిడిగుండ్ల, గోపన్నగూడెం మీదుగా తెలంగాణలోని కంట్లం వైపు పులి వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి పర్యవేక్షణలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లను ఉపయోగిస్తున్నారు.

పులి సంచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, రాత్రి వేళల్లో బయట సంచరించవద్దని మైక్‌ ప్రచారం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us