AP Cabinet: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. జనవరి 1 నుంచే.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని యోచించింది. తాజా నిర్ణయం ప్రకారం 29 జిల్లాల బదులు 28 జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

AP Cabinet: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. జనవరి 1 నుంచే.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
Ap Cabinet

Updated on: Dec 29, 2025 | 4:19 PM

సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. దాదాపు 24 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న జిల్లాల్లో పలు మార్పులు చేశారు. అలాగే డివిజన్లు, మండలాలను మార్చడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం.

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు

గత ప్రభుత్వం జిల్లాల విభజన సరిగ్గా చేపట్టలేదని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం..  పునర్విభజనలో భాగంగా కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 29 జిల్లాల బదులు 28 జిల్లాలకే పరిమితం చేయాలని చూస్తోంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటును కేబినెట్ ఆమోదించింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిర, యర్రగొండపాలెం కలిపి ఒక జిల్లాగా త్వరలో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ముందడుగు వేయగా.. ఇక అన్నమయ్య జిల్లా పేరును అలాగే ఉంచగా.. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. రాజంపేట కేంద్రంగా జిల్లా కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయచోటినే కొనసాగించాలంటూ అక్కడ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాయచోటి కాకుండా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బనగానపల్లె, అడ్డరోడ్లను డివిజన్లుగా ఏర్పాటు చేయనుండగా. పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చాలని నిర్ణయించారు. అలాగే విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించారు. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం స్ఫష్టం చేసింది.

మంత్రి భావోద్వేగం

రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలిపోవడంపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్‌ మీటింగ్‌లోనూ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రిని సీఎం చంద్రబాబు సముదాయించి రాయచోటి అభివృద్ధిపై భరోసా ఇచ్చారు. కేబినెట్‌ సమావేశం తర్వాత ఈ అంశంపై మీడియా ప్రశ్నించడంతో మంత్రి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పుపై ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబుతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయచోటిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు.. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.