పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేయడంపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర జీవనాడిగా పేర్కొనే పోలవరం పై కేంద్రప్రభుత్వం నుంచి నిపుణుల కమిటీల వరకు అన్నీ వైసీపీనే (YCP) తప్పు పడుతున్నాయని అన్నారు. పోలవరం కాంట్రాక్టర్ ను మార్చవద్దని లేఖలు రాసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా గోదావరి (Godavari) వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 2014 నుంచి ఇబ్బంది లేని పోలవరం విలీన గ్రామాలు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్లు చేయడాన్ని చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జగనన్న కాలనీలు కాదు – జలగన్న కాలనీలు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బడులు మూసి బార్లు తెరుస్తున్నారని పేర్కన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన విలీన గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. గోదావరి వరదల నాటి నుంచి పోలవరం, విలీన గ్రామాలపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల ప్రజల డిమాండ్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే ఇలా జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు, వరదల నాటినుంచి కరెంటు, నీరు లేక వరద బాధితులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. టీడీపీ చేసిన తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే ఆలస్యం అయిందంటూ వివరించారు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరు..? అంటూ ప్రశ్నించారు. సీఎంపై అవాకులు చవాకులు పేలాడానికి సిగ్గు లేదా..? అంటూ నిలదీశారు. ఇంత వరద వచ్చినా ప్రాజెక్ట్‌కు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానెల్ పూర్తి చేశామన్నారు. డయాఫ్రమ్ వాల్ గురించి అన్ని తెలియాలంటే.. తానేమి ఇంజినీర్‌ను కాదని..కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..