Anantapur: ‘చత్రపతి ప్రభాస్’ని తలపిస్తున్న కాందిశీకుల గాధ.. 32 ఏళ్ల నుంచి నీటిపై రాతలుగా ఉండిపోయిన హామీలు..

Anantapur District News: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం శరణార్థులుగా వచ్చిన శ్రీలంక కాందిశీకులు ఉపాధి లేక, ఇల్లు వాకిలి లేక తీవ్ర కష్టాలకు గురవుతున్నారు. శ్రీలంకలో అంతర్యుద్ధం(1981) ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో భారత్‌కి..

Anantapur: ‘చత్రపతి ప్రభాస్’ని తలపిస్తున్న కాందిశీకుల గాధ.. 32 ఏళ్ల నుంచి నీటిపై రాతలుగా ఉండిపోయిన హామీలు..
Srilankan Refugees in Guntakal
Follow us
Nalluri Naresh

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 14, 2023 | 11:58 AM

Anantapur District News: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం శరణార్థులుగా వచ్చిన శ్రీలంక కాందిశీకులు ఉపాధి లేక, ఇల్లు వాకిలి లేక తీవ్ర కష్టాలకు గురవుతున్నారు. శ్రీలంకలో అంతర్యుద్ధం(1981) ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో భారత్‌కి వలస వచ్చారు. భారత ప్రభుత్వంతో శ్రీలంక ప్రభుత్వం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా దశాబ్దాల క్రితమే పని కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన చర్యల మేరకు అలా శరణార్థులుగా వచ్చిన వీరందరికీ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అప్పట్లో అసియా ఖండంలోనే అతి పెద్ద గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లుకు 250 కుటుంబాలను ఉపాధి కల్పించడం కోసం పంపించారు. వీరికి ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కో-ఆపరేటివ్ శాఖకు 36 వేల రూపాయలు నివాసం కోసం, మరో 14 వేల రూపాయలు.. మొత్తం 50వేల రూపాయలు కేటాయించింది. ఈ చర్యల్లో భాగంగా వీరి ఉపాధి కోసం గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లులో నూతన యంత్ర సామాగ్రిని కూడా కొనుగోలు చేశారు. రోజుకు మూడు రూపాయల దిన కూలీలుగా కార్మికులుగా పనిచేసిన వీరు 2 సంవత్సరాల అనంతరం రెగ్యులర్ కార్మికులుగా గుర్తింపు పొందారు.

అలా మరో 8 సంవత్సరాలు సవ్యంగానే సాగింది. అనంతరం 1991లో ఆర్థికంగా నష్టాలు, కార్మిక సమస్యలు, గొడవల కారణంగా గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లుకు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన వీరందరూ ఉపాధి లేక స్థానికంగా కూలీ నాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎప్పటికైనా మిల్లు తెరుచుకోకపోతుందా అన్న ఆశతో అలాగే జీవితం కొనసాగిస్తున్నారు. అప్పటి నుండి మూడు దశాబ్దాలు దాటినా, పాలకులు మారినా‌, నాయకులు మారినా మిల్లును తెరుస్తామన్న హామీలు మాత్రం అలాగే నీటిపై రాతలుగా ఉండిపోయాయి. పెద్దగా ఉపాధి అవకాశాలు లేని ఈ ప్రాంతంలో జీవించడం చేతకాక శ్రీలంక కాందిశీకుల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. 250 కుటుంబాలలో ప్రస్తుతం కేవలం 30 నుండి 40 కుటుంబాలు మాత్రమే ఈ ప్రాంతంలో సరైన వసతులు, మౌలిక సౌకర్యాలు లేక జీవనోపాధి దొరకక దుర్భర జీవితం గడుపుతున్నారు.

కాగా, తాము ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీలంకలో తమ తాత, ముత్తాతలు పనిచేసి సంపాదించుకున్న పొలాలు, ఇల్లు అన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చామంటున్నారు. అప్పట్లో తమకు ప్రభుత్వం కేటాయించిన ఇల్లు కూడా కాగితాలపైనే ఉంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను, ఇళ్లను ఇతరులు కబ్జా చేసారని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తామ నివాసముంటున్న కొట్టాలనే తమకు కేటాయించి ఇల్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని వాటిని కూడా చెల్లించేలా చర్యలు చేపట్టాలని శ్రీలంక కాందిశీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లిన తమ తోటి వారందరూ బాగానే ఉన్నారని.. ఇష్టం ఉన్నా, లేకపోయినా ఇక్కడికి వచ్చిన తమ జీవితం మాత్రం దుర్భరంగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..