
తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో హుండీ చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. భక్తుడి రూపంలో ఆలయంలోకి ప్రవేశించిన ఓ యువకుడు హుండీలోని నగదును కాజేయడానికి ప్రయత్నించగా ఆలయ సిబ్బంది అప్రమత్తతతో పట్టుబడ్డాడు. ఆలయ అధికారుల వివరాల ప్రకారం.. రాజమండ్రిలోని తాటితోపు తోట ప్రాంతానికి చెందిన సత్య లక్ష్మణ్ వెంకటేష్ అనే యువకుడు భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం హుండీ సమీపంలోని స్తంభంపైకి ఎక్కి, హుండీలో చేయి పెట్టి అందులోని నగదును బయటకు తీసే ప్రయత్నం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆలయ సిబ్బంది గమనించేలోపే కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైంది.
శనివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనను ఆలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. హుండీ వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న యువకుడిని గమనించిన సెక్యూరిటీ ఇన్‌చార్జి రవి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించారు.
తనిఖీల్లో అతని వద్ద నుంచి రూ.25,170 నగదు లభించింది. ఆ డబ్బు హుండీలో నుంచి తీసినదేనని అధికారులు గుర్తించారు. అనంతరం నగదును స్వాధీనం చేసుకుని, సంఘటనపై శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని నిందితుడు సత్య లక్ష్మణ్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒంటరిగా ఈ చోరీకి పాల్పడ్డాడా, లేదా మరెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే గతంలో ఇలాంటి ఘటనల్లో అతనికి సంబంధం ఉందా అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి