Andhra Pradesh: బావకు తోడుగా వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..!

బ్యాంకు లోన్ ఇప్పించినందుకు వచ్చే కమిషన్ విషయంలో తలెత్తిన గొడవ.. ఓ సాఫ్టవేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గొడవలో బావకు తోడుగా వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తలుపుల ఎస్సై నరసింహుడు తెలిపారు.

Andhra Pradesh: బావకు తోడుగా వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..!
Software Employee Srikanth

Updated on: Sep 02, 2025 | 7:49 AM

బ్యాంకు లోన్ ఇప్పించినందుకు వచ్చే కమిషన్ విషయంలో తలెత్తిన గొడవ.. ఓ సాఫ్టవేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గొడవలో బావకు తోడుగా వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తలుపుల ఎస్సై నరసింహుడు తెలిపారు.

తలుపుల మండల పరిషత్‌ కార్యాలయంలో బోరు-పంపు మెకానిక్‌గా పనిచేస్తున్న కృష్ణయ్యకు శ్రీకాంత్‌ ఒక్కగానొక్క కుమారుడు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే అతనికి కుమారుడు పుట్టాడు. పిల్లాడికి నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో అనుకోని ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

తలుపుల మండల కేంద్రానికి చెందిన డిష్‌ శ్రీనివాసులు కుమారుడు అనిరుధ్‌ వివిధ బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తుంటాడు. ఈ క్రమంలో బలిజపేటకు చెందిన రాజారాం.. అదే ప్రాంతానికి చెందిన శోభా అనే మహిళకు లోన్ ఇప్పించాలని అనిరుధ్‌కు పరిచయం చేశాడు. లోన్ మంజూరు కావడంతో అందులో నుంచి తనకూ కమీషన్‌ కావాలని అనిరుధ్‌ను రాజారాం నిలదీశాడు. దీంతో ఇద్దరు మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే శనివారం (ఆగస్టు 30) రాత్రి అనిరుధ్‌ ఇంటికి వెళ్లి అతని బైక్‌ను ధ్వంసం చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ విషయం తెలుసుకున్న అనిరుధ్‌, అతని తండ్రి శ్రీనివాసులు తలుపులకు వచ్చారు. ఈ గొడవకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. రాజారాంకు తోడుగా అతని బావమరిది శ్రీకాంత్‌(30) వారితో వెళ్లాడు. అయితే రాజారాం-అనిరుధ్ మధ్య జరుగుతున్న ఘర్షణకు మధ్యలో వెళ్లిన శ్రీకాంత్‌ బలయ్యాడు. అనిరుధ్‌పై కత్తితో దాడి చేసేందుకు రాజారాం ప్రయత్నించాడు. ఇంతలో అడ్డుగా వచ్చిన శ్రీకాంత్‌కు కత్తిపోట్లు తగిలాయి. శ్రీకాంత్‌ తొడపై పొడవడంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది. దీంతో అతన్ని కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతిచెందాడు.

ఈ గొడవలో అనిరుధ్‌కు, అతని తండ్రి శ్రీనివాసులకు సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజారాం తండ్రి వెంకటరాయప్పను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుమారుడికి నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ హత్యకు గురవడంతో.. ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..