Sangameshwara Temple: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన సంగమేశ్వర ఆలయం జలదివాసమైనది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం నీట మునిగింది. నంద్యాల జిల్లాలో ఉన్న సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. దీంతో ఆలయ పూజారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదికి చీర సారె సమర్పించి, మంగళ హారతి ఇచ్చారు. గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘరామ శర్మ ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం ఎనిమిది నెలలు ఆగాల్సిందే.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జిలాలు చుట్టుముట్టాయి. వరద నీటిలో మునిగిన సంగమ తీరం సంద్రాన్ని తలపిస్తోంది. సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. గత ఏడాది కూడా జులైలోనే సంగమేశ్వరుడి గుడి గర్భాలయంలోకి నీరు ప్రవేశించింది. ఈ ఆలయంలో వేపలింగాన్ని భీముడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సంగమ తీరంలో గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఆలయం నీట మునిగిన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి