Eluru District: ఇంట్లో నుంచి నాటు కోళ్లు మిస్సింగ్… బోను పెట్టగా చిక్కిన అరుదైన జీవి

రాత్రి సమయాల్లో ఏవో జంతువులు వచ్చి కోళ్లను ఎత్తుకుపోతున్నాయి. దీంతో వాటికి చెక్ పెట్టేందకు బోన్లను అమర్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి.. చూడటానికి పిల్లిలా ఉండి.. సైజ్‌లో మాత్రం పెద్దగా ఓ జంతువు కోళ్ల కోసం వచ్చి బోనులో చిక్కింది.

Eluru District: ఇంట్లో నుంచి నాటు కోళ్లు మిస్సింగ్... బోను పెట్టగా చిక్కిన అరుదైన జీవి
Maanu Pilli

Updated on: Jan 05, 2024 | 11:32 AM

ఏలూరు జిల్లాలో ఓ అరుదైన జీవి.. బోనులో చిక్కింది.  పెదపాడు మండలం అప్పనవీడు పంచాయతీ తాళ్లమూడిలో ఉజ్జనేని సాయికుమార్‌.. తన ఇంట్లో పందెం కోళ్లను పెంచుతుంటాడు. అయితే ఇటీవలి కాలంలో.. రాత్రి సమయాల్లో ఏవో జంతువులు వచ్చి కోళ్లను ఎత్తుకుపోతున్నాయి. దీంతో వాటికి చెక్ పెట్టేందకు బోన్లను అమర్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి.. చూడటానికి పిల్లిలా ఉండి.. సైజ్‌లో మాత్రం పెద్దగా ఉన్న ఓ జంతువు కోళ్ల కోసం వచ్చి బోనులో చిక్కింది. అయితే అది ఏం జంతువో వారికి అర్థం కాలేదు. దీంతో అటవీ శాఖ అదికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారితో సహా ఇతర సిబ్బంది వచ్చి.. ఆ జంతువును పరిశీలించి.. అది పునుగు పిల్లి జాతికి చెందిన మానుపిల్లి అని నిర్ధారించారు. ఈ మాను పిల్లిని చూసేందుకు, దాన్ని ఫోటోలు తీసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు సాయి కుమార్ ఇంటికి వచ్చారు.

ఇవి జనాలు ఎక్కువగా లేని నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తాయని తెలిపారు. మాను పిల్లి (సివిట్ క్యాట్)ని స్వాధీనం చేసుకున్న అధికారులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచర్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ మాను పిల్లి తప్పించుకుని నివాసాలవైపు వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా ఇది అరుదైన జీవి అని తెలిపారు. అటవీ జంతువులు దారి తప్పి జనవాసాల్లోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.