Raptadu School Incident: రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్ అప్‌డేట్.. వారికి SHRC నోటీసులు
తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన రాప్తాడు హైస్కూల్ బాలికపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.బాలికపై రంపంతో దాడి ఘటనపై SHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఏపీ మానవ హక్కుల కమిషన్ సంఘటనకు సంబంధించిన రికార్డులు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్.. విద్యాశాఖ అధికారులతో పాటు అనంతపురం జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మానవ హక్కుల కమిషన్.. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఘటనకు సంబంధించి 2026 డిసెంబర్ 4వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), ఇతర సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో పిల్లల భద్రతను నిర్ధారించడంలో ఉన్న లోపాలతో పాటు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) జారీ చేసిన భద్రతా మాన్యువల్ అమలు తీరుపై ఆరా తీసింది.
ఈ క్రమంలో పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు, ఇతర సిబ్బంది నియామకానికి ముందు పోలీసు వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారా లేదా అనే వివరాలను కోరింది. అలాగే విద్యార్థుల రవాణా ఏర్పాట్లు, పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇతర భద్రతా చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
