Andhra: ఏకంగా ఆరు ఉద్యోగాలు ఒడిసిపట్టిన పులివెందుల ఆడబిడ్డ..

నేటి పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతోంది. అలాంటిది ఓ సాధారణ మధ్యతరగతి యువతి ఏకంగా ఆరు కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి ప్రయత్నంలో ఎదురైన పరాజయానికి కుంగిపోకుండా, పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని ముద్దాడిన వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన చిదిగే సాయి వర్షిత విజయ ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Andhra: ఏకంగా ఆరు ఉద్యోగాలు ఒడిసిపట్టిన పులివెందుల ఆడబిడ్డ..
Sai Varshitha

Edited By:

Updated on: Sep 22, 2026 | 5:16 PM

వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన అనిలాదేవి, గురుదత్త దంపతుల రెండో కూతురు సాయి వర్షిత పదో తరగతి వరకు స్థానికంగానే చదువుకుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించి , తన ప్రతిభతో ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది. చిన్నతనం నుంచే చదువులో రాణిస్తున్న ఆమె దృష్టి ఉన్నత స్థాయి ప్రభుత్వ కొలువులపై పడింది.

న్యాయశాస్త్రం పూర్తి చేసిన అనంతరం సాయి వర్షిత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పోటీ పరీక్షలకు సిద్ధమైంది. 2024లో రాసిన మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దాటినప్పటికీ, మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ ఓటమిని పాఠంగా మలచుకున్న వర్షిత.. తన బలహీనతలను అధిగమిస్తూ మరింత కసితో ప్రిపరేషన్ కొనసాగించింది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా వరుసగా కేంద్ర న్యాయశాఖలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ కోఆపరేటివ్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, టెక్నికల్ క్లర్క్ వంటి ఐదు కీలక పోస్టులు దక్కాయి.

వరుస విజయాలు సాధించినప్పటికీ సాయి వర్షిత సంతృప్తి చెందలేదు. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించాలన్న లక్ష్యంతో మళ్లీ ఎస్‌ఎస్‌సీ పరీక్షకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కేవలం 412 పోస్టులకు ఏకంగా 28,15,445 మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 13.77 లక్షల మంది పరీక్ష రాశారు. ఇంతటి తీవ్రమైన పోటీని తట్టుకుని సాయి వర్షిత అద్భుత ప్రతిభతో ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 19న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకుంది. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని నిరూపించిన సాయి వర్షితను స్థానికులు, అధికారులు ఘనంగా అభినందిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us