
హాయ్ నారాయణ.. అంటూ ఫేస్‌బుక్‌లో ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకేముంది.. అవతలి వైపు ఉన్నది అమ్మాయే కదా అని నమ్మి సదరు వ్యక్తి హలో అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ చిన్న పరిచయం కాస్తా చాటింగ్‌లకు దారితీసింది. ఆపై మాటలు ముదిరి తీవ్ర వ్యామోహంగా మారింది. కట్ చేస్తే.. కేవలం రెండు నెలల కాలంలోనే ఆ ఫేస్‌బుక్ సుందరి సదరు వ్యక్తిని ఏకంగా రూ.23 లక్షలకు ముంచేసింది. తీరా అసలు నిజం తెలిశాక బాధితుడి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే.. ఇన్ని రోజులు తను ప్రాణంగా చాటింగ్ చేసింది అమ్మాయితో కాదు.. ఒక అబ్బాయితో.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబులే ఈ వలపు వలలో పడి నిలువునా మునిగిపోవడం అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది.
అనంతపురం డీఎస్పీ డ్రైవర్‌గా తలారి నారాయణస్వామి అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. గత మార్చి నెలలో ఆయనకు ఫేస్‌బుక్‌లో సాయి శ్రీ అనే పేరుతో ఉన్న ఒక ఐడీ నుండి మెసేజ్ వచ్చింది. దానికి నారాయణస్వామి రిప్లై ఇవ్వడంతో ఇద్దరి మధ్య నిత్యం చాటింగ్ సాగింది. సాయి శ్రీ అనే పేరుతో ఉన్న అవతలి వ్యక్తి నారాయణస్వామిని పూర్తిగా తన మాయమాటల వలలో పడేసుకున్నాడు.
పరిచయం పెరిగిన కొద్దిరోజులకే సదరు ఫేస్‌బుక్ అకౌంట్ నుండి అర్జెంట్‌గా రూ.30 వేలు కావాలి అంటూ మెసేజ్ వచ్చింది. వెనుకా ముందు ఆలోచించని కానిస్టేబుల్ వెంటనే ఆ డబ్బులు పంపించాడు. ఆ తర్వాత కూడా రకరకాల కారణాలు చెప్తూ పలుమార్లు నారాయణస్వామి నుంచి ఏకంగా రూ.23 లక్షల రూపాయలు వసూలు చేసింది ఆ మాయలాడి.
అయితే ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత ఒకసారి మనం కలుద్దాం అంటూ కానిస్టేబుల్ నారాయణస్వామి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా అవతలి వ్యక్తి ఏదో ఒక సాకుతో దాటవేస్తూ వచ్చాడు.
చివరకు ఒన్ ఫైన్ డే ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన డ్రీమ్ గర్ల్‌ను చూడబోతున్నాననే ఆనందంతో వెళ్లిన నారాయణస్వామికి అక్కడ షాక్ తగిలింది. ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి కానిస్టేబుల్ కంగుతిన్నాడు. ఇన్ని రోజులు సాయి శ్రీ పేరుతో తనతో చాటింగ్ చేసింది ఒక అమ్మాయి కాదు.. అబ్బాయి అని తెలిసి నారాయణస్వామి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే.. అలా అమ్మాయి పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తి ధర్మవరం పట్టణానికి చెందిన వెంకటేష్ అనే ఒక స్వలింగ సంపర్కుడు. తను ఒక అబ్బాయితో, అదీ ఒక గే తో ఇన్ని రోజులు చాటింగ్ చేసి రూ.23 లక్షలు పోగొట్టుకున్నానని తెలిసి కానిస్టేబుల్ లబోదిబోమన్నాడు.
తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన కానిస్టేబుల్ నారాయణస్వామి.. అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల పబ్లిక్‌కు అవేర్‌నెస్ కల్పించాల్సిన పోలీసే.. ఇలా ఫేస్‌బుక్ వలపు వలలో పడి సర్వం కోల్పోవడం చూస్తుంటే, “ఎంతటి వాడైనా కాంతదాసుడే” అనే సామెత నిజమేనని స్థానికంగా చర్చించుకుంటున్నారు.