
చిత్తులాట.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? అసలు ఇది దేనికి సంబంధించిన పేరు అనే డౌట్ మీకు వస్తుందా..? ఎందుకంటే చిత్తులాట అనే పేరు సాధారణంగా చాలామంది విని ఉండరు. పల్లె ప్రాంతాల్లో ఎక్కడో చిత్తులాట అనే పేరు వినిపించడం తప్ప ..పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఈ ఆటలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆడవచ్చు. మరో రెండు నెలల్లో సంక్రాంతి రానుంది. సంక్రాంతి తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పెద్ద పండుగ.. అదేవిధంగా పందెం రాయుళ్లు సంక్రాంతి ఎప్పుడు వస్తుందని నెలల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి సమయంలో పెద్ద ఎత్తున కోడిపందాలు, పేకాట, గుండాటలాంటి జూద క్రీడలు ఎన్నో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న చిత్తులాట కూడా అదే కోవకు వస్తుంది.
ఎందుకంటే చిత్తులాటలో సైతం జుదరులు డబ్బును పణంగా పెట్టి ఆటాడుతున్నారు. ప్రస్తుతం చిత్తులాట ఆడుతున్న జుదరులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడికాలువ గట్టుపై పెద్ద ఎత్తున చిత్తులాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 7400 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదెలా ఉంటే కోడి పందాలు, పేకాట, గుండాట ఎలా ఆడతారో అందరికీ తెలుసు కానీ ఈ చిత్తులాట ఎలా ఆడతారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా చిత్తలాట కోసం నాలుగు వన్ రూపీ కాయిన్స్ ను సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఒక కాయిన్ తో ఇద్దరు వ్యక్తులు హెడ్ అండ్ టైల్ వేసుకుంటారు.. హెడ్ వచ్చిన వ్యక్తి రూపాయి కాయిన్స్ ను నేలకేసి కొట్టాలి అదే గేమ్… మీకు అర్థం కాలేదు కదా.. వివరంగా చెప్తాను వినండి.. ఆట కోసం ముందుగా ఇద్దరు వ్యక్తులు సిద్ధమవుతారు. వారిద్దరిపై కోడి పందేల మాదిరిగా మిగిలిన వ్యక్తులు బెట్టింగ్ కాస్తారు. ఇద్దరు వ్యక్తులలో టాస్ వేసినప్పుడు వన్ రూపీ కాయిన్ హెడ్ పడిన వ్యక్తి తన చేతిలో నాలుగు వన్ రూపీ కాయిన్లు తీసుకుని నేలకేసి బలంగా కొడతాడు. అయితే అందులో మూడు కాయన్లు హెడ్ పడితే నేలకేసి కొట్టిన వ్యక్తి గెలిచినట్టు.. అదే మూడు కాయిన్లు టాస్ పడితే కాయిన్లు నేలకేసి కొట్టిన వ్యక్తికి ఆపోజిట్ గా ఉన్న వ్యక్తి గెలిచినట్టు. అలా వారిద్దరిపై మిగిలిన వారందరూ బెట్టింగ్స్ కాస్తారు. దీనినే చిత్తులాట అంటారు. అయితే ఈ ఆట పల్లెటూరులో ఎక్కువగా ఆడతారు. ప్రస్తుతం సంక్రాంతి సమీపించడంతో ఖాళీగా ఉన్న వ్యక్తులు చిత్తులాటలో బెట్టింగ్ కాసి వారి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అయితే పోలీసులు సైతం ఎక్కడైనా చిత్తులాట ఆడితే తమకు సమాచారం అందించాలని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.