Polavaram Gates Lifting: పోలవరం ప్రాజెక్టు కీలక ఘట్టం మొదలు.. ఆరు గేట్లను ఎత్తిన అధికారులు
Polavaram Gates

Polavaram Gates Lifting: పోలవరం ప్రాజెక్టు కీలక ఘట్టం మొదలు.. ఆరు గేట్లను ఎత్తిన అధికారులు

|

May 21, 2021 | 4:40 PM

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టం మొదలైంది. పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభించారు.

Polavaram Gates Lifting: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టం మొదలైంది. పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభించారు. వరదలు వచ్చేనాటికి స్పిల్‌వే నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రాజెక్ట్‌ గేట్ల లిఫ్టింగ్‌ని అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతం 40 మీట‌ర్ల ఎత్తున ఆరు గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. మొత్తం 48 గేట్లకుగాను 42 గేట్లను అధికారులు అమర్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల అమ‌రిక పూర్తయింది.

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటిదాకా 17 ప‌వ‌ర్ ప్యాక్‌లను అమర్చే కార్యక్రమం పూర్తయింది. ఒక్కో ప‌వ‌ర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. వ‌ర‌ద‌లు వ‌చ్చేనాటికి 42 గేట్లకు ప‌వ‌ర్‌ప్యాక్‌లు అమ‌ర్చి లిఫ్ట్‌మోడ్‌లో పెట్టబోతున్నారు అధికారులు. వ‌చ్చే వ‌ర‌ద నీటినంతా స్పిల్‌వే గుండా కిందికి విడుద‌ల చేయ‌డానికి అనువుగా గేట్లు ఏర్పాటవుతున్నాయి. ఎన్సీ నారాయణ రెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్‌ఈ నరసింహ మూర్తి, ఈఈలు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం సతీష్ బాబు ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు.

పవర్ ప్యాక్‌ల సాయంతో ఈ హైడ్రాలిక్ సిలిండర్లు పని చేస్తాయి. వీటి సాయంతో 300టన్నుల బరువు కలిగిన గేటు ఒక్కో నిమిషానికి 1.5మీటర్ల మేర పైకి లేపగలిగేందుకు వీలుంది. ఒక్కో గేటు ఎత్తేందుకు, దించేందుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. ఒక్కో హైడ్రాలిక్‌ సిలిండర్‌ బరువు 20మెట్రిక్ టన్నులు, పొడవు 17.30మీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకొన్నారు. హైడ్రాలిక్ సిలిండర్ల అమరికలో జర్మనీకి చెందిన మౌంట్ అనే సంస్థ సాంకేతిక సాయం అందిస్తోంది. ఒక్కొగేటు బరువు 2 వేల 400 టన్నులు…పోలవరం భారీ ప్రాజెక్టులో అమర్చుతున్న ఒక్కో గేటు 2వేల 400టన్నుల బరువును తట్టుకొనే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు.


గోదావరి నదిలో వచ్చే భారీ వరద పోటును నియంత్రించేలా వీటి నిర్మాణం చేపట్టారు. నదిలో ఒక్కసారిగా పెరిగే వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లను తెరిచేందుకు ఈ హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. వర్షాకాలం సీజన్ నాటికి నదిని స్పిల్ వేపై మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also…  Pregnant Women Helpline: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గర్బిణి కోసం ప్రత్యేక వైద్య సహాయ కేంద్రం.. హెల్ప్ లైన్ నంబర్‌ ఏర్పాటు

Published on: May 21, 2021 03:32 PM