AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM RAHAT: రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ న్యూస్.. లక్షన్నర వరకు ఉచిత వైద్యం.. ఇవి తెలుసుకోండి..

రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడేది ఆ మొదటి గంట మాత్రమే. కానీ చేతిలో డబ్బు లేకనో, ఆస్పత్రులు చేర్చుకోకనో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి దారుణ పరిస్థితులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త'పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

PM RAHAT: రోడ్డు ప్రమాద బాధితులకు గుడ్ న్యూస్.. లక్షన్నర వరకు ఉచిత వైద్యం.. ఇవి తెలుసుకోండి..
Pm Rahat Scheme For Accident Victims
B Ravi Kumar
| Edited By: |

Updated on: Apr 16, 2026 | 2:05 PM

Share

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయంలో ప్రాణభిక్ష పెట్టేలా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక, చేతిలో నగదు లేక ప్రాణాలు కోల్పోతున్న ఎందరో బాధితులకు వరంలా పీఎం రాహత్ పథకాన్ని ఈ నెల 11 నుండి అమలులోకి తెచ్చింది. దీని పూర్తి పేరు ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూడ్ ట్రీట్మెంట్. రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే తక్షణ వైద్య సేవలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

పథకం నిబంధనలు

తీవ్రంగా గాయపడిన బాధితులకు లక్షన్నర రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారు. కేవలం ప్రభుత్వాస్పత్రులే కాకుండా గుర్తింపు పొందిన అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఈ చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు బాధితులు ఆస్పత్రిలో చేరాలి. చేరిన రోజు నుండి గరిష్టంగా 7 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఈ పథకం భరిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112* నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణ సాయం అందుతుంది.

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న రహదారి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పిస్తోంది. పోలీసు, రవాణా, వైద్య శాఖల సమన్వయంతో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నారు.

డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క ప్రాణం పోకూడదన్నదే ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ అవగాహన చేసుకుని, అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Follow Us