
పిఠాపురం రాజకీయాల్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అక్కడ టీడీపీ, జనసేన మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూడాలని నిర్ణయించింది. తరచూ బయటపడుతున్న విభేదాలు, స్థానిక నాయకుల మధ్య మాటల యుద్ధం, కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుత టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ, త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది.
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు జనసేన కేడర్ ఆధిపత్యం పెరగడం, మరోవైపు ఎన్నాళ్లుగానో పార్టీ కోసం పనిచేస్తున్న టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరగడం కనిపించింది. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన రెండు పార్టీల మధ్య తర్వాత స్థానిక స్థాయిలో సమన్వయం ఆశించిన స్థాయిలో సాగలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. పిఠాపురంలో గత కొన్ని నెలలుగా చిన్న చిన్న ఘటనలే పెద్ద చర్చలకు దారి తీస్తున్నాయి. కార్యక్రమాల నిర్వహణలో ప్రోటోకాల్ వివాదాలు, ఫ్లెక్సీలు-బ్యానర్లలో ఫొటోల అంశం, ఎవరికెంత ప్రాధాన్యం అన్న చర్చలు తరచూ బయటపడ్డాయి. టీడీపీ స్థానిక నాయకత్వం, జనసేన శ్రేణుల మధ్య అంతర్గత అసహనం పెరుగుతోందనే సంకేతాలు అప్పుడప్పుడూ బయటకు వచ్చాయి.
తాజాగా చంద్రబాబు ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి రాజకీయ వేడి పెంచింది. ఈ అంశంపై జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, వర్మ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ ఘటన తర్వాత రెండు పార్టీల కేడర్ మధ్య సోషల్ మీడియాలో కూడా పరస్పర విమర్శలు పెరిగాయి. స్థానికంగా ఇది మరింత పెద్ద వివాదంగా మారకముందే అధిష్టానం జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ గత కొన్నేళ్లుగా పిఠాపురం టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జనసేనతో సమన్వయం విషయంలో వర్మ శైలిపై కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. స్థానికంగా వివాదాలు తరచూ బయటపడటం కూడా అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో వర్మకు మద్దతుగా మాట్లాడుతున్న నాయకులు కూడా ఉన్నారు. పిఠాపురంలో టీడీపీ కేడర్‌ను కాపాడింది వర్మేనని, ఇప్పుడు ఆయనను పక్కనపెడితే కార్యకర్తల్లో తప్పు సందేశం వెళ్తుందని చెబుతున్నారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తి ఆధారిత వ్యవస్థ కంటే సమిష్టి బాధ్యతలతో ముందుకెళ్లడమే మంచిదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్క నాయకుడి ఆధ్వర్యంలో కాకుండా స్థానికంగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా కమిటీని రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు, కేడర్ ప్రతినిధులు, జనసేనతో సమన్వయం చూసే నాయకులను ఇందులో భాగం చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే కమిటీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
నియోజకవర్గంలో కార్యక్రమాల సమన్వయం, ప్రభుత్వ పథకాల అమలు, కేడర్ సమస్యలు, కూటమి పార్టీల మధ్య కమ్యూనికేషన్ వంటి అంశాలను కమిటీ పర్యవేక్షించేలా రూపకల్పన జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పిఠాపురం సాధారణ నియోజకవర్గం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో అక్కడి ప్రతి పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్న వేళ స్థానిక స్థాయిలో విభేదాలు బయటపడటం మంచిది కాదని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా భవిష్యత్ రాజకీయ సమీకరణాల దృష్ట్యా పిఠాపురంలో ఎలాంటి నెగెటివ్ సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలని టీడీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే వ్యక్తిగత విభేదాలకు చెక్ పెట్టి, సమన్వయ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కమిటీ వ్యవస్థ తీసుకొస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.