సర్వేలో సానుకూలతలు.. గ్రౌండ్‌లో పాజిటివ్ వైబ్స్.. ఫైనల్‌గా పిఠాపురంలో అమీతుమీకి సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్. అధినేత ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అదే సమయంలో.. టీడీపీలో మాత్రం అసమ్మతి అగ్గిరాజేసింది. ఈ ఆగ్రహజ్వాల ఎటువైపు టర్న్ అవుతుందోనన్న ఆందోళన కూటమిని కలవరపెడుతోంది.
పొత్తులో భాగంగా వరుసగా స్థానాలు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్.. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. పవన్ ప్రకటనను జనసేన శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మాత్రమే ఉందని.. ఎంపీగా పోటీపై పెద్దల సూచనలు తీసుకుంటానన్నారు.
పిఠాపురంలోనే పవన్ ఎందుకు పోటీ అన్నదానిపై చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో 90వేలకు పైగా కాపు ఓట్లు ఉన్నాయి. ఈ ఈక్వేషన్‌లో బంపర్ విక్టరీ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఊపునిచ్చిందీ స్థానం. అదే జోరు ఈసారి కూడా కొనసాగుతుందని జనసేన లెక్కలేసుకుంటోంది. ఇక వారాహి యాత్రకు అనూహ్య స్పందన రావడం పోటీకి మరో కారణంగా కనిపిస్తోంది. సొంతంగా చేయించుకున్న సర్వేలన్నీ పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చాయట. వీటన్నింటితో పాటు కాపు నేతల సవాళ్లకు సమాధానంగా ఇక్కడ పోటీ చేసి గెలవాలని పవన్ డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది.
పవన్ ప్రకటనతో జనసేన శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్న వేళ టీడీపీలో ఆగ్రహజ్వాల భగ్గుమంది. ఎస్వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకే టీడీపీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ ప్రకటనపై స్పందించిన వర్మ.. గత 20ఏళ్లుగా టీడీపీతో ఉన్నానని గుర్తు చేసి వెళ్లిపోయారు. పిఠాపురంలో అసమ్మతి సెగకు అధిష్ఠానం ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుంది? వర్మను ఎలా దారికి తెచ్చుకుంటుంది? ఎలాంటి హామీతో శాంతిపజేస్తుందన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..