మృత్యువులోనూ మారని మానవత్వం.. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన.. గొప్ప మనస్సు చాటుకున్న తల్లిదండ్రులు!

విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. కడుపుకోతను అనుభవిస్తూ కూడా ఇద్దరు కుమారుల కళ్లను దానం చేసిన ఆ తల్లిదండ్రుల నిర్ణయం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, పరహితం కోరిన ఆ తల్లిదండ్రుల నిర్ణయంపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మృత్యువులోనూ మారని మానవత్వం.. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన.. గొప్ప మనస్సు చాటుకున్న తల్లిదండ్రులు!
Parents Donate Sons Eyes

Edited By:

Updated on: May 07, 2026 | 3:32 PM

విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన, మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. కడుపుకోతను అనుభవిస్తూ కూడా ఇద్దరు కుమారుల కళ్లను దానం చేసిన ఆ తల్లిదండ్రుల నిర్ణయం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని, పరహితం కోరిన ఆ తల్లిదండ్రుల నిర్ణయంపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

విజయనగరం జిల్లా వంగర మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన తోట అజయ్ (26), విజయ్ (23) అన్నదమ్ములు. ఆ కుటుంబానికి వీరే పెద్ద దిక్కు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్న ఈ యువకులు, విజయనగరం మండలం జొన్నవలస సమీపంలోని జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బైక్ బోల్తా పడటంతో తీవ్ర రక్తస్రావమై, ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారులను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య, తల్లి శోభ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ సమయంలో మహారాజా ఆసుపత్రి రెడ్‌క్రాస్ నేత్ర విభాగం టెక్నీషియన్ రమణ, ఇతర వైద్యులు, నేత్రదానం ప్రాముఖ్యతను వారికి వివరించారు. తమ బిడ్డలు మరణించినా, వారి కళ్ల ద్వారా మరికొందరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించవచ్చని ఆ తల్లిదండ్రులు భావించారు. ఆ ఘోర విషాదంలోనూ వారు గుండె నిబ్బరం చేసుకుని, కుమారుల కళ్లను దానం చేసేందుకు అంగీకరించారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ పర్యవేక్షణలో వైద్య బృందం అన్నదమ్ముల కళ్ల నుండి కార్నియాలను సేకరించారు. ఈ నేత్రదానం ద్వారా నలుగురు అంధులకు చూపు లభించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. “తమ కుమారులు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, సమాజం కోసం వారు తీసుకున్న నిర్ణయం అత్యున్నతమైనది. ఆ తల్లిదండ్రుల త్యాగం సామాన్యులకు స్ఫూర్తిదాయకం.” అని వైద్య బృందం అభినందించింది.

ప్రాణం పోయినా పరుల కోసం బ్రతకవచ్చని చాటిచెప్పిన ఈ ఘటన, మరణానంతరం అవయవదానంపై సమాజంలో గొప్ప ఆలోచనను రేకెత్తించింది. వారి బిడ్డలు భౌతికంగా లేకపోయినా, నలుగురు అంధుల కళ్లలో వెలుగుగా వారు జీవించే ఉంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us