
ఏలూరు: విభూది అంటే ఐశ్వర్యం.. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది విభూది. విభూదితో అభిషేకిస్తే పరమేశ్వరుడు పరవశించిపోతారు. అలాంటి విశిష్టమైన విభూది అభిషేకాన్ని ప్రతి సంవత్సరం సోమేశ్వరస్వామికి వైభవంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో స్వామి వారికి విభూదితో అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు. శివుడు అభిషేక ప్రియుడు. జలంతో అభిషేకిస్తేనే పరవశించిపోతాడు. అలాంటిది ఆయనకు ఇష్టమైన విభూదితో అభిషేకిస్తే మరింత పరవశించిపోతారని ఆలయ అర్చకులు అంటున్నారు. సోమేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం ఆఖరి మాసంలో మాస శివరాత్రి రోజున భస్మాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ తెలిపారు. తెలుగు సంవత్సర కాలమాన ప్రకారం ఫాల్గుణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సంవత్సరంలో ఆఖరి మాసశివరాత్రి. ఆరోజున సోమేశ్వర స్వామికి ఘనంగా భస్మాభిషేకం కొన్ని సంవత్సరాలుగా జరుపుతున్నామని రామకృష్ణ శర్మ తెలిపారు.
గోమయం, మారేడు కాయలు, బిల్వ దళాలు, కస్తూరిలతో చేసిన విభూదిని భస్మాభిషేకానికి ఉపయోగిస్తామని అంటున్నారు. భీమవరంలోని పంచారామ క్షేత్రంలో ఉన్న సోమేశ్వరస్వామి లింగం చాలా విశిష్టమైనది. స్వామి వారి లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్టించడం వల్ల లింగంలో చంద్రకళలు స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక్కడ పూజలు చేసి.. ప్రార్థిస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని పేర్కొంటున్నారు భక్తులు..
స్వామివారి లింగం అమావాస్యకు ముదురు గోధుమ రంగులోనికి, పౌర్ణమికి శ్వేతవర్ణంలోనికి మారుతూ ఉంటుంది. ఇది పరమేశ్వరుని మహిమగా భక్తులు విశ్వసిస్తారు. అంతటి విశిష్టత కలిగిన స్వామివారికి భష్మాభిషేకం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు అంటున్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి భస్మాభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తారని భక్తులు నమ్ముతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..