సీఎం చంద్రబాబు చొరవతో స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళకు ‘వెలుగు’లోకి వచ్చిన గ్రామం..!

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన తరువాత నల్లమల అటవీ ప్రాంతం మారుమూల పల్లె పాలుట్ల గిరిజన తండాలో సోలార్‌ విద్యుత్‌ కాంతులు విరజిమ్మాయి... దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గుతున్న అడవిపుత్రుల కోసం 3 కోట్లతో ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ అమర్చడంతో గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం ఏర్పడింది..

సీఎం చంద్రబాబు చొరవతో స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళకు ‘వెలుగు’లోకి వచ్చిన గ్రామం..!
Palutla Village Power Supply

Edited By:

Updated on: Feb 07, 2026 | 8:36 PM

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన తరువాత నల్లమల అటవీ ప్రాంతం మారుమూల పల్లె పాలుట్ల గిరిజన తండాలో సోలార్‌ విద్యుత్‌ కాంతులు విరజిమ్మాయి… దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గుతున్న అడవిపుత్రుల కోసం 3 కోట్లతో ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ అమర్చడంతో గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం ఏర్పడింది.. అలాగే 2.22 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పనులను ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా పాలుట్ల గ్రామంలో గిరిజనులు నిజమైన పండుగ వచ్చిందంటూ సంబరాలు చేసుకున్నారు. మంత్రి గొట్టిపాటికి, ప్రభుత్వానికి గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు.

దశాబ్దాలుగా కారు చీకట్లు.. కొండరాళ్ళే రహదారి..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శతాబ్ద కాలంగా చీకట్లోనే మగ్గిపోతున్న పాలుట్ల గిరిజన తండా వాసుల వెలుగుల్లోకి వచ్చారు. యర్రగొండపాలెం మండలంలోని ఈ మారుమూల గ్రామానికి సరైన రోడ్డు వసతి లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో లోతైన కొండల మధ్య ఉన్న ఈ గ్రామం తన సహజ సౌందర్యానికి, సాహస యాత్రలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు.

యర్రగొండపాలెం నుంచి కేవలం 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాలుట్ల గ్రామానికి వెళ్ళాలంటే పెద్ద కొండ రాళ్ళతో కూడిన దారే దిక్కు. కమాండో జీపులు తప్ప కార్లు వెళ్ళలేవు. ఈ 50 కిలో మీటర్ల దూరం దాటాలంటే మూడు గంటల సమయం పడుతుంది. రాళ్ళ మార్గం కావడంతో జీపుల్లో వెళ్ళేవారి ఒళ్ళు హూనం కావాల్సిందే. అలాంటి ఈ గిరిజన గ్రామానికి రావాలంటే గతంలో మావోయిస్టు భయం కూడా ఉండేది. అందుకే ఈ గ్రామానికి రోడ్డు వేయాలంటే ఎవరూ ముందుకు రాలేదు. గ్రామంలో ఎలాంటి విద్యుత్‌ సౌకర్యాలు లేకపోవడానికి కూడా గతంలో మావోయిస్టుల భయమే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం మావోయస్టులు నల్లమలలో తుడిచిపెట్టుకుపోవడంతో ఇప్పడిప్పుడే ఈ గ్రామం గురించి బాహ్య ప్రపంచం తెలుసుకుంటోంది. అధికారులు కూడా గ్రామంలో పర్యటించి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నారు.

ఇన్నాళ్లకు గ్రామంలో విద్యుత్‌ కాంతులు..

పాలుట్ల గ్రామంలో గిరిజన కుటుంబాల కోసం 3 కోట్ల రూపాయల వ్యయంతో ‘అప్-గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్’ను ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించారు. పాలుట్లతో పాటు చుట్టుపక్కల ఉన్న 611 గృహాలకు సౌర విద్యుత్తు వెలుగులు విరజిమ్మేలా చర్యలు తీసుకున్నారు. కారు చీకట్లలో మగ్గిపోతున్న నల్లమల ప్రాంతంలోని గిరిజన గూడేల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పీఎం-జన్‌మన్‌ పథకం కింద వ్యక్తిగత సౌర విద్యుత్తు యూనిట్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి వీటి ఏర్పాటును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ రాజాబాబుతో కలిసి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

పాలుట్లలో 551, పెద్దారుట్లలో 32, నెక్కంటిలో 17, చిన్నారుట్లలో 5, పెద్దచేమ, రోళ్ల పెంటలో 3 చొప్పున ఇంటింటికి సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పథకం కింద ఒక్కో లబ్దిదారుడికి 50 వేల విలువైన సౌర పలకలు, 300 వాట్స్ బ్యాటరీ, అయిదు ఎస్ఈడీ దీపాలు, డీసీ టేబుల్ ఫ్యాన్ ఉచితంగా అందజేశారు. అత్యధిక గృహాలు ఉన్న పాలుట్లలోని 551 ఇళ్లల్లో సౌర విద్యుత్తు వెలుగులు నింపారు. దీంతో రాత్రివేళ గ్రామమంతా దేదీప్యమానంగా వెలిగి పోతుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా లేని గిరి జన గృహాలకు సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటికి కృతజ్ఞతలు తెలిపారు.

తండాలకు రోడ్లు.. పొలాలకు సోలార్‌ కరెంట్: మంత్రి

యర్రగొండపాలెం మండలంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న పాలుట్ల గిరిజన గ్రామంలో మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటింటికి ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ సిస్టం తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబుతో కలిసి కలిసి ప్రారంభించారు. అధికారులు సోలార్ ద్వారా ప్రతి ఇంటికి ఐదు లైట్లు, ఒక ఫ్యాన్ ఏర్పాటు చేయగా వాటిని మంత్రి రవికుమార్ పరిశీలించి లబ్ది దారులతో మాట్లాడారు. తమ ఇళ్ళకు లైట్లు ఫ్యాన్ ఏర్పాటు చేయడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.

రిజర్వ్ ఫారెస్ట్ లోని పాలుట్ల లో జీవిస్తున్న ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టి కి తీసుకెళ్ళి, వెంటనే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిధులు సమకూర్చారని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇక్కడ ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో పాలుట్ల వంటి గ్రామాలను గుర్తించి ఇదేవిధంగా ప్రతి ఇంటికి విద్యుత్ తోపాటు ఫ్యాన్ లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. పాలుట్లలో మూడు ఏకరాలలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలకు సోలార్ ద్వారా విద్యుత్ అందించే విషయాన్ని సీఎం చంద్రబాబు కు తెలియజేసి, రైతులకు సహకారం అందిస్తానని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.

వందనం దొర…

రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉన్న తమ గ్రామానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తోపాటు కలెక్టర్, ప్రజాప్రతినిధులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా తమ గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, ఇప్పటికైనా గ్రామంతో పాటు తమ జీవితాల్లో వెలుగులు నింపారంటూ పాలుట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..