ఓర్నీ.. తెనాలిలో ఈ దందా కూడా షురూ చేశారా..?

తెనాలిలో ఆన్‌లైన్ అశ్లీల కాల్స్, చాటింగ్ రాకెట్ బయటపడింది. “స్ట్రిప్ టాక్” పేరుతో పోర్టల్ నిర్వహిస్తూ డబ్బులు తీసుకుని మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు మహిళలను విచారించగా… అసలు సూత్రధారి సాయి అనే యువకుడిగా తేలింది.

ఓర్నీ.. తెనాలిలో ఈ దందా కూడా షురూ చేశారా..?
Tenali Crime

Edited By:

Updated on: Apr 19, 2026 | 1:30 PM

అశ్లీల కాల్స్, చాటింగ్ కలకలం తెనాలిలో బయటపడింది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి.. మహిళలతో అశ్లీల చాటింగ్, వీడియో కాల్స్ నిర్వహిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు.. అసలు సూత్రధారి ఒక యువకుడని తేల్చారు.

తెనాలి చెంచుపేట, పాండురంగపురం ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులైన మహిళలు ఈ ఆన్‌లైన్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. “స్ట్రిప్ టాక్” పేరుతో నడుస్తున్న ఈ పోర్టల్‌కు ఎక్కడి నుంచైనా కనెక్ట్ అయ్యే వీలుండేది. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించిన వారికి అశ్లీల కాల్స్, చాటింగ్ సేవలు అందిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ వ్యవహారం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుండటంతో.. మహిళలు స్వయంగా నిర్వహించే అవకాశం లేదని భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో మహిళల్లో ఒకరి కుమారుడు సాయి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు బయటపడింది. మరికొంతమంది మహిళలను డబ్బులు ఇచ్చి ఈ కార్యకలాపాల్లోకి దింపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు వందమంది వరకు మహిళలు ఈ నెట్‌వర్క్‌లో ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.

ఇటీవల ఆ మహిళల ఇంటికి తరచుగా కొత్త వ్యక్తులు రాకపోకలు సాగించడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు కేసును స్వయంగా పర్యవేక్షించారు. ముందుగా ఆన్‌లైన్ పోర్టల్‌పై దృష్టి సారించిన పోలీసులు… అందులో కనిపించిన మహిళలను గుర్తించి విచారించారు.

విచారణలో అసలు సూత్రధారి సాయి అని నిర్ధారించగా… ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్లు, ఆన్‌లైన్ వివరాలను సేకరించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో మహిళలను బాధితులుగా పరిగణిస్తూ.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇటువంటి తరహా ఆన్‌లైన్ అశ్లీల కాల్స్ రాకెట్ బయటపడటం రాష్ట్రంలో అరుదైన ఘటనగా భావిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకువస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us