
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. కానీ గిట్టుబాట ధర లేకపోవడంతో వాటిని మార్కెట్లకు తీసుకెళ్లడం కూడా దండగే అనుకున్నారు. ఇంకేముంది పండించిన చేనులోనే పంటను పశువులకు మేతగా వేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంకు చెందిన హకిమ్ అనే రైతు మూడు ఎకరాల పొలంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఉల్లి వేసి పంటను సాగుచేసాడు. కానీ ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి పంటను పండించిన పొలంలోనే వదిలేశారు. మూడు ఎలారాల్లో ఎకరాకు రెండు లక్షల 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కిలోకు 5 రూపాయలు మాత్రమే ఉండటంతో చాలా నష్టపోతున్నామని, కనీసం పెట్టబుడి డబ్బులు కూడా రావట్లేదని కనీసం పశువులకు మేతగా ఐనా పనికి వస్తుందని గొర్రెలకు మేతగా వేస్తున్నామన్నారు.
కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని తవ్వి.. మార్కెట్లకు తీసుకు రావడం కంటే పొలంలో దున్నేయడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లి పంటను సాగు చేసి లోడు తీసేసరికి దాదాపు రెండు లక్షల రూపాయల నష్టం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..