
భార్య విలాసవంతమైన జీవితం, చిట్టీలు వేస్తే నష్టం.. ఫ్లాట్ వాయిదాలు చెల్లించలేక తంటాలు.. పైగా అప్పులోళ్ల ఒత్తిడి.. ఇవన్నీ తాళలేక భర్త భార్యను వదిలిపెట్టాడు.. దీంతో భార్య పెద్ద స్కెచ్చే వేసింది.. ఆర్ధిక కష్టాల నుంచి గట్టెంకకెందుకు మాస్టర్ ప్లాన్ రచించింది.. యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకుంది.. కన్న కొడుకును దొంగతనానికి ఉసిగోల్పింది.. ఆ తర్వాత.. దొరకకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మొత్తం తీసుకుంది.. కానీ.. పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన తల్లీకొడుకులను విశాఖపట్నం పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
విశాఖపట్నం నగరానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, చిట్టీలు వేసి భారీగా నష్టపోయింది. కొనుగోలు చేసిన ఫ్లాట్ EMI చెల్లించలేక, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. చుట్టుముట్టిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ధనలక్ష్మి అడ్డదారి వెతికింది. ఈజీ మనీ కోసం ఆమె యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో చూసి పక్కాగా స్కెచ్ వేసింది. ఈ పాపంలో తన కన్నకొడుకు అక్షిత్‌ను కూడా భాగస్వామిని చేసింది. పోలీసులు దొరకకుండా ఉండేందుకు ఈ తల్లీకొడుకులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కూటీ నెంబర్ ప్లేట్ కనిపించకుండా ప్లాస్టర్ వేశారు. కొడుకు అక్షిత్ టోపీ, మాస్క్ ధరించి బైక్ నడపగా, తల్లి ధనలక్ష్మి చున్నీతో ముఖం కనిపించకుండా కప్పేసుకుంది.
జూన్ 27న సుజాతనగర్‌లో ఒంటరిగా వెళ్తున్న ఓ వృద్ధురాలిని వీరు టార్గెట్ చేశారు. అడ్రస్ అడుగుతున్నట్లు మాటలు కలిపి, ఒక్కసారిగా ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసును తెంచుకుని స్కూటీపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టి నిందితుల ఆనవాళ్లను గుర్తించారు. తల్లీకొడుకులను అరెస్ట్ చేసి, వారి నుంచి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..