
కాకినాడ, ఏప్రిల్ 14: కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకువెళ్లడంతో తల్లీకుమారుడు మృత్యు వాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్రాడ గ్రామస్తులు అయిన తల్లి కుమారుడు మరణ వార్త వినగానే గ్రామంలో విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన దుర్గాగణపతి, తల్లి లక్ష్మి(50)ని చిన్న కుమారుడు దుర్గాగణపతి(28) కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వస్తున్నాడు. రాయుడుపాలెం వద్ద వాహనం అదుపుతప్పి ప్రధాన మురుగు కాలువలోకి దూసుకువెళ్లింది. చాలాసేపటి వరకు స్థానికులు ఎవ్వరూ వీరిని గుర్తించలేదు. దీంతో కొందరు గమనించి వీరిని బయటకు తీసి చిత్రాడలోని ఒక ప్రైవేట్ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ తల్లి కుమారుడు ఇద్దరూ మృతిచెందారు.
కాలువలో ముందు తల్లీ, కుమారుడు పడిపోగా.. వాహనం వారిమీద ఉండిపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. చాలాసేపు వారిని ఎవరూ చూడకపోవడంతో మురుగు నీటిలోనే కొట్టుమిట్టాడారు. వారి మృతితో కుటుంబ పెద్ద సత్యనారాయణ, పెద్ద కుమారుడు, కుమార్తె కన్నీరు మున్నీరవుతున్నారు. తల్లి కుమారుడు ఇద్దరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలుగా ఎలక్షన్లో తమ వంతు కృషిగా విశేష సేవలు అందించారని ప్రజలు చెప్పుకుంటున్నారు. వీరి ఇరువురు జనసేన కార్యకర్తలుగా నమోదు చేసుకున్నారు. జనసేన ఐడి కార్డులను కుటుంబ సభ్యులు మీడియా ముందు చూపించారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రమాదాలు ఆగడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిన తాజా సంఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.