దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు.. నేపాల్ వరదల్లో ఎలా బతికారంటే..?

భగవంతుడు రక్షిస్తే మృత్యువు కూడా వెనకడుగు వేయక తప్పదు.. నేపాల్‌లో విరుచుకుపడిన భీకర జలప్రళయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 మంది యాత్రికులు కేవలం 100 మీటర్ల దూరం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారు తీసుకున్న ఒక చిన్న టీ బ్రేక్ మృత్యువు నోటి నుంచి వారిని ఎలా తప్పించిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.

దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు.. నేపాల్ వరదల్లో ఎలా బతికారంటే..?
How A Short Tea Break Saved 26 Pilgrims From Ap

Updated on: Aug 29, 2026 | 9:14 AM

భగవంతుడు కాపాడాలని అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే నానుడి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ భక్తుల విషయంలో అక్షరాలా నిజమైంది. నేపాల్‌లో ముంచెత్తిన భీకర జలప్రళయంలో కేవలం 100 మీటర్ల దూరం నుంచి మృత్యుంజయులుగా బయటపడ్డారు తిరుపతికి చెందిన 26 మంది యాత్రికులు. స్థానికుల అప్రమత్తత, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో పాటు వాళ్లు ఆగిన ఒక చిన్న టీ బ్రేక్ 26 నిండు ప్రాణాలను కాపాడింది. కైలాస మానససరోవర్ యాత్ర నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి 26 మంది భక్తులు నేపాల్‌కు వెళ్లారు. వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో వారు ఖాట్మండులోని ఓ హోటల్‌లో రెండు రోజుల పాటు బస చేశారు. ఆగస్టు 25న ఉదయం 6 గంటలకు చైనా సరిహద్దు వైపు బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో బస్సును ఆపి అందరూ టీ తాగేందుకు కొద్దిసేపు విరామం తీసుకున్నారు.

వారు టీ తాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా వరద పోటెత్తింది. అకస్మాత్తుగా వచ్చిన మెరుపు వరదలకు వారు ప్రయాణించాల్సిన వంతెన కొట్టుకుపోయినట్లు స్థానికులు గమనించారు. భారీ వరద ముంచెత్తుతోందని, బస్సును వెంటనే వెనక్కి తిప్పాలని స్థానిక ప్రజలు గట్టిగా హెచ్చరించారు. డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును సురక్షిత ప్రాంతానికి మళ్లించాడు. ‘‘మేము టీ బ్రేక్ తీసుకోకపోయి ఉంటే.. మా బస్సు సరిగ్గా వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆ వంతెన పైనే ఉండేది. వరద ప్రవాహానికి మేము కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నాం. స్థానికులు హెచ్చరించడం, డ్రైవర్ వెంటనే స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాం’’ అని ఢిల్లీకి చేరుకున్న ఓ యాత్రికుడు భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ తెలిపారు.

దేవుడి దయ వల్ల, అప్రమత్తమైన నిర్ణయాల వల్ల ప్రాణాలతో స్వదేశానికి చేరుకున్నామని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలు, సమన్వయం అందించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కాగా నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 547 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 977 మంది ఆచూకీ గల్లంతైంది. సహాయక బృందాలు సుమారు 1,545 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. భోటేకోశి నది పరివాహక ప్రాంతాల్లో మళ్లీ వరదలు పోటెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us