Yanam: యానాం గోదావరిలో కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..

యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో గోదావరిలో లవణీయత ఒక్కసారిగా తగ్గి, ఉప్పునీటిలో జీవించే కానాగంత చేపలు మృతిచెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు, మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.

Yanam: యానాం గోదావరిలో  కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..
Kanaganta Fish

Edited By:

Updated on: Jul 11, 2026 | 10:21 AM

 

యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికులను కలవరపెడుతోంది. గోదావరి ఒడ్డున, నీటిపై తేలుతూ కనిపిస్తున్న మృత చేపల దృశ్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా యానాం–ఎదుర్లంక వంతెన సమీపంలోని గోదావరి ప్రవాహంలో ఈ ఘటన ఎక్కువగా కనిపిస్తోంది.

గత నెలలో ఇదే ప్రాంతంలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ కానాగంత చేపలు చిక్కాయి. అయితే ఇప్పుడు అదే జాతికి చెందిన చేప పిల్లలు పెద్ద ఎత్తున మృతిచెందడంతో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కాలుష్యం కారణమా? లేక నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

లవణీయతలో మార్పే కారణమా?

మత్స్యకారుల వివరాల ప్రకారం, కానాగంత చేపలు సాధారణంగా సముద్రం, గోదావరి ముఖద్వారం ప్రాంతాల నుంచి గుంపులుగా గౌతమి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. ఇవి ప్రధానంగా ఉప్పునీరు లేదా బ్రాకిష్ వాటర్ (ఉప్పు–తీపి నీటి మిశ్రమం)లో జీవించే చేపలు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తీపినీరు గోదావరిలోకి చేరింది. దీంతో నీటిలో లవణీయత ఒక్కసారిగా తగ్గి, ఈ చేపలు తట్టుకోలేక మృతిచెందినట్లు మత్స్యకారులు భావిస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ఇదే

కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాల జువాలజీ విభాగాధిపతి డా. బొల్లోజు అహ్మద్ అలీబాబా మాట్లాడుతూ, కానాగంత చేపలు సముద్రం నుంచి గౌతమి గోదావరిలోని ఉప్పునీటి ప్రాంతాలకు వలస వస్తాయని తెలిపారు. నీటిలో లవణీయత ఒక్కసారిగా తగ్గిపోతే అవి ఆ మార్పును తట్టుకోలేక మృతి చెందే అవకాశం ఉందని వివరించారు.

యానాం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతేడాది కూడా గోదావరి నుంచి పెద్ద ఎత్తున తీపినీరు సముద్రంలో కలిసిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడం వల్ల నీటి లవణీయత తగ్గి, కానాగంత చేపల మరణాలకు అదే ప్రధాన కారణంగా ఉండొచ్చని తెలిపారు.

అయితే చేపల మరణాలకు ఖచ్చితమైన కారణం తెలుసుకోవాలంటే నీటి నమూనాలను పరీక్షించి నివేదిక వెలువడాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Follow Us