Jagan 2.0: మంత్రి పదవి రాలేదని ఒకరు.. ఉన్న పదవి పోయిందని మరొకరు.. వైసీపీలో అసమ్మతి గళం..

|

Apr 10, 2022 | 10:00 PM

సామాజిక న్యాయం జరిగే క్రమంలో కొంతమంది నేతలకు కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. పదవులు ఆశించిన బాలినేని, పిన్నెల్లి, ఉదయభాను, కోటంరెడ్డి, కరణం ధర్మశ్రీ, సుచరిత, అన్నా రాంబాబులకు నిరాశ ఎదురైంది. దీంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల అనుచరులు వరుసగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.

Jagan 2.0: మంత్రి పదవి రాలేదని ఒకరు.. ఉన్న పదవి పోయిందని మరొకరు.. వైసీపీలో అసమ్మతి గళం..
Balineni Srinivasa Reddy A
Follow us on

మంత్రి పదవి రాలేదని ఒకరు.. ఉన్న పదవి పోయిందని మరొకరు.. వైసీపీలో అసమ్మతి గళం మెల్లిగా మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) పదవి రెన్యువలు ఉండదలని తెలియడంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Macherla MLA Rama Krishna Reddy Pinnelli) జగన్‌ 2.0లో పదవి(AP Cabinet) వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. ఎలక్షన్‌ టీమ్‌లో కచ్చితంగా చోటు ఉంటుందని భావించారు కాని ప్రాబబుల్స్‌ లిస్టులోనూ ఆయన పేరు వినిపించకపోవడంతో ఆయనా అలిగారు. అటు కోటం రెడ్డి కూడా పార్టీకోసం కేసులను ఎదుర్కొన్న సంగతి గుర్తుచేస్తున్నారు. బాలినేనికి మంత్రిపదవి దాదాపు లేనట్టే. ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్‌కి పదవిని రెన్యువల్‌ చేసి.. తనకు చేయకపోవడంతో ఆయనకు బీపీ పీక్స్‌కి వెళ్లింది. ఈరోజు ఉదయం బాలినేనికి హైబీపీ రావడంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారాయన. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. ఆయనకు పదవి రాకపోవడంపై అనుచరులు కూడా గుర్రుగా ఉన్నారు.

దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బాలినేని ఇంటికెళ్లారు. ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. మంత్రి పదవి కాకున్నా.. పార్టీలో ప్రధాన్యతతోపాటు ఇతర పదవులకూ హామీ లభిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు బాలినేని ఇంటికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వచ్చారు. మంత్రుల జాబితాలో ఆయన పేరూ ఉన్నా.. కొడాలినాని కొనసాగుతుండడంతో.. ఉదయభానుకి పదవి దక్కే చాన్స్‌ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. అయితే పార్టీలో తాను సీనియర్‌ అని ప్రకటించుకున్న ఉదయభాను.. తనకు పదవి వస్తుందని గట్టిగానే చెబుతున్నారు.

మరోవైపు ఎంతోకాలంగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పదవిని ఆశించారు. ఆయన పేరు లిస్టులో లేకపోవడంతో అనుచరులు సైతం గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిన్నెల్లికి పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు అనుచరులు లేకపోతే పార్టీతోపాటు.. ఇతర పదవులకూ రాజీనామా చేసేందుకు సిద్ధమంటున్నారు.

మరో అసంతృప్తినేత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. మంత్రివర్గ విస్తరణలో తనకు గుర్తింపు దక్కలేదని నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పార్టీకోసం ప్రభుత్వంతో పోరాడినట్లు గుర్తు చేస్తున్నారు. వైసీపీలో ముందు నుంచి ఉన్నా తమ నేతకు ప్రాధాన్యత దక్కలేదని కోటంరెడ్డి వర్గం అలకబూనారు.

కాంగ్రెస్ అధికారంలో ఉండగా జగన్ వైపు నడిచినందుకు అక్రమ కేసులు ఎదుర్కొన్నామని.. అయినా మంత్రి వర్గ జాబితాలో గుర్తించకపోవడం దారుణమంటున్నారు కోటంరెడ్డి. రేపటి నుంచి నియోజకవర్గంలో కోటంరెడ్డి తలపెట్టిన గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయం.. విదేశాంగ మంత్రిగా జుల్ఫికర్ అలీ భుట్టో మనవడు..