
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం తొండెపి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా… పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వల్లెపు లక్ష్మయ్య, భూలక్ష్మి దంపతులు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదుగురు సంతానం ఉన్న ఈ కుటుంబంలో భూలక్ష్మి కుట్టుపనితో పాటు వ్యవసాయ పనులు చేస్తూ భర్తకు ఆర్థికంగా అండగా ఉండేది. లక్ష్మయ్య టాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల భూలక్ష్మి తల్లి కూడా వీరి వద్దే నివసించడం ప్రారంభించడంతో కుటుంబంలో విభేదాలు పెరిగాయి.
భార్యపై అనుమానం పెంచుకున్న లక్ష్మయ్య.. తరచూ గొడవలకు దిగుతున్నాడు. వారం రోజుల క్రితం అత్తకు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చాడన్న ఆరోపణలతో కుటుంబంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఘటన తర్వాత దంపతుల మధ్య ఘర్షణలు రోజురోజుకూ తీవ్రమయ్యాయి.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంట్లో భూలక్ష్మి స్నానం చేసి వచ్చిన సమయంలో… లక్ష్మయ్య కత్తితో ఆమెపై దాడి చేశాడు. కాళ్లపై విచక్షణారహితంగా నరికి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి కేకలు విని చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెకు బట్టలు వేసి ఆసుపత్రికి తరలించారు.
అనంతరం లక్ష్మయ్య ఇంటి నుంచి బయటకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని మొదట సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి… మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. భార్య, అత్తపై దాడికి పాల్పడిన లక్ష్మయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.