ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. చేయి చేయి కలిపారు: ఆ అడవి బిడ్డలకు సలాం చేయాల్సిందే..

ఏళ్ల తరబడి ప్రభుత్వాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో అరకులోయ గిరిజనులు స్వయంగా వంతెన నిర్మించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అల్లూరి జిల్లా మాడగడ పంచాయతీ మెచ్చగూడ గ్రామస్తులు చందాలు వేసుకుని, బంగారం తాకట్టు పెట్టి, పశువులు అమ్మి సుమారు రూ.15 లక్షలు సమకూర్చి వాగుపై బ్రిడ్జి నిర్మించారు.

ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. చేయి చేయి కలిపారు: ఆ అడవి బిడ్డలకు సలాం చేయాల్సిందే..
Madagada Tribal Villagers Build Bridge

Edited By:

Updated on: May 13, 2026 | 5:30 PM

వాళ్లంతా అడవి బిడ్డలు.. కొండ కోనల్లో జీవనం.. ఆధునిక యుగంలోనూ వారికి సరైన మౌలిక సదుపాయాలు ఆమడ దూరమే.. ఆ గ్రామం నుంచి బయటకు రావాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి. దీంతో నిత్యం వాళ్ళ ప్రయాణం ఒక సాహసమే. వర్షాకాలంలో అయితే.. ఆ ఇబ్బందులు వర్ణనాతీతం. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఆ వాగు పై వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఏళ్లుగా ఆ గిరిజనులు కోరుతూనే ఉన్నారు. పాలకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. విసిగి వేసారిన ఆ అడవి బిడ్డలు.. ఇక తమ కష్టాలు తామే తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. చేయి చేయి కలిపారు.. చందాలు వేసుకొని నిధులు సమకూర్చుకున్నారు. అంతటితో ఆగలేదు.. పలుగు పారా పట్టి.. వంతెన నిర్మాణం చేసుకున్నారు.

అల్లూరు జిల్లా అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ మెచ్చగూడ గ్రామం. 25 కుటుంబాల వరకు నివాసముంటున్నారు. ఆ ఊరు నుంచి బయటకు రావాలంటే వాగు దాటాల్సి వస్తుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ రావాలన్న ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తూ వచ్చారు.. ఏళ్ల తరబడి తమ కష్టాలను పాలకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన.. ఆ సమస్య తీరలేదు. రహదారి కాదు కదా కనీసం వాగుపై వంతెన నిర్మాణం చేయాలని కోరినా స్పందించలేదు. కోటి రూపాయల వరకు వ్యయం అవుతుందని అధికారులు చేతులెత్తేశారు. ఏళ్ళుగా ఉన్న సమస్య తీరకపోవడంతో ఇక గ్రామస్తులంతా ఏకమయ్యారు.

గ్రామస్తులంతా చందాలు వేసుకున్నారు.. చేయి చేయి కలిపి నిధుల సమీకరించారు. కూరగాయలు, కాఫీ, మిరియాల పంటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడగట్టారు. కొంతమంది మహిళలు బంగారం తాకట్టు పెట్టడం, మరి కొందరు పశువులు అమ్మడం ద్వారా డబ్బు సమకూర్చడం చేశారు. ఇక.. దుకాణాల నుండి ఇనుము, సిమెంటు వంటి సామాగ్రి అప్పుగా కూడా తెచ్చుకోని బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. గ్రామస్తులు వ్యక్తిగతంగా 10వేల నుంచి 1 లక్ష వరకు విరాళాలు సేకరించారు. మొత్తం సుమారు 15 లక్షలు సమకూర్చి బ్రిడ్జి స్లాబ్ వేశారు. దీంతో ఇక తమ వాగు కష్టాలు గట్టెక్కాయని అంతా ఆనందం వ్యక్తం చేశారు.

ఇవే గ్రామస్తులు అంతకుముందే ముందు మాడగడ ప్రధాన రహదారి నుండి తమ గ్రామానికి 2 కిలోమీటర్ల మట్టి రోడ్డును కూడా స్వయంగా నిర్మించుకున్నారు. ఈ గిరిజనుల సాహసం ఇప్పుడు మన్యంలో చర్చనీయాంశంగా మారింది. అందరూ అడవి బిడ్డలను అభినందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి.. తాము నిర్మించుకున్న మట్టి రోడ్డుపై బీటీ వేయాలని కోరుతున్నారు గిరిజనులు..

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us