ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది విడుదలైన రిజల్ట్స్ తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ నడుస్తోంది. ఉపాధ్యాయుల సంఖ్య తగినంత లేకపోవడం, కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకపోవడం, పేపర్ లీక్ వంటివి రిజల్స్ట్ పర్సంటేజ్ తగ్గడానికి కారణాలుగా భావిస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రం పదో తరగతికే(Tenth Class in AP) ప్రాధాన్యం ఇచ్చి, మిగతా తరగతులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. ఆయా తరగతుల విద్యార్థులు పదో తరగతిలోకి వచ్చాక వారికి సబ్జెక్ట్ అర్థం కావడం లేదు. కరోనా కారణంగా 8, 9 తరగతుల్లో పరీక్షలు రాయకుండానే విద్యార్థులు పదో తరగతికి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో విద్యావ్యవస్థపై ఎంతో పర్యవేక్షణ ఉండాలి. కానీ అవి గాడి తప్పడంతో ఫలితాల శాతం తగ్గాయని విద్యానిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 6,15,908 మంది పరీక్షలు రాస్తే 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో 2002లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈసారే ఇంత తక్కువగా 67.26 శాతం నమోదవడం గమనార్హం.
ఈసారి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నపత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయి. మొదటి మూడు రోజులు జరిగిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష పరీక్షల్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన మ్యాథ్స్, సైన్స్, సోషల్ లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. తెలుగులో 91.73% పాస్ పర్సంటేజ్ నమోదవగా.. సోషల్ లో కేవలం 81.43% మంది మాత్రమే పాస్ అయ్యారు. రాష్ట్రంలో 71 బడుల్లో ఒక్కరూ పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూల్స్ 31 ఉండడం విశేషం. రెండేళ్లు గడిచేసరికి 22 ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. 2019లో సున్నా ఫలితాలు వచ్చిన ప్రభుత్వ బడి ఒక్కటీ లేకపోగా.. రెండేళ్లలోనే ఇంతటి దారుణ పరిస్థితి ఏర్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా అంటే.. ఆగస్టు 16 నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. చాలామందిలో ఏకాగ్రత తగ్గిందని ఉపాధ్యాయులు ముందే గుర్తించారు. వాటిని సవరించేందుకు అధికారులు ఎందుకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాగా.. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో సుమారు 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలి పాఠశాలలో 13 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండగా.. నంద్యాల జిల్లా సున్నిపెంటలో 12 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలుగా మార్చిన 500 బడులకు హెడ్ మాస్టర్స్ లేరు.
అంతే కాకుండా పదో తరగతి పరీక్షల విధానంలోనూ మార్పులు చేశారు. 2019 వరకు 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడు పేపర్లకు కుదించారు. గతంలో ఒక పేపర్‌లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్‌లో కవర్ చేసుకునేవారు. ఈసారి ఒకే పేపర్ కావడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. 8, 9 తరగతుల్లో పరీక్షలు రాయకుండా నేరుగా పది పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి