
విశాఖ జిల్లా పాడేరు వైసీపీ మహిళా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రజల సమస్యలు తెలుసుకోడానికి సాహసం చెయ్యాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకోడానికి ఆమె గుర్రంపై వెళ్లారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో… ఆమె అక్కడకు వెళ్లారు. అటవీ ప్రాంతం కావడంతో..కొండలు, గుట్టలు వంటివి ఉంటాయి. సరైన రోడ్డు మార్గాలు ఉండవు. సొంత వాహనాల్లో కూడా వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో మహిళా ఎమ్మెల్యే గుర్రంపై ప్రయాణించాల్సి వచ్చింది. డింగిరాయి నుంచి చిత్తమామిడి వరకు భాగ్యలక్ష్మి గుర్రంపై ప్రయాణించారు. స్థానికులను పరామర్శించి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు వారికీ స్వయంగా ఆహారం వండి వడ్డించారు.
తనకు గుర్రపు స్వారీ రాకపోయినా సరే ఎమ్మెల్యే.. ప్రజల సాయంతో ధైర్యం చేసి గుర్రంపై ప్రయాణించి గ్రామాలకు వెళ్లారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని చాలామందికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఆమె గుర్రం మీద ప్రయాణిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.