
అదంతా అడవి ప్రాంతం అక్కడ నివసించే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుక్కుమంటూ బ్రతకాల్సిందే. నిత్యం, పులులు, ఎలుగుబంట్లు సంచరించే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎటునుంచి ఏ జంతువు వస్తుందో, ఏ క్రూరమృగం వచ్చి దాడి చేస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలను గుప్పిట్టో పెట్టుకొని జీవిస్తున్నారు. అనుకున్నట్టే ఇటీవల స్థానకంగా నివసించే ఓ చెంచు యువకుడిపై ఒక్కసారిగా పెద్దపులి దాడి చేసింది. గమనించిన స్తానికులు కేకలు వేయడంతో ఆ పెద్దపులి చెంచు యువకుడిని ప్రాణాలతో వదిలేసి అడవిలోకి పారిపోయింది.
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గుడానికి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడిపై సోమవారం రాత్రి పెద్దపులి దాడి చేసింది. అంకన్న గుడెం శివారులో బహిర్బుమికి వెళ్లడంతో పొదల్లో దాక్కొని ఉన్న పెద్దపులి ఒక్కసారిగా అంకన్న పై గాండ్రింపులతో దాడి చేసింది. వెంటనే అతను కేకలు వేయడంతో గూడెం వాసులు పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ అక్కడి చేరుకున్నారు. స్థానికుల అరుపుల శబ్ధాలు విన్న పెద్దపులి భయపడిపోయి అంకన్నను అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది. పులి దాడి నుంచి బయటపడిన అంకన్నకు కాళ్లకు చేతులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
విషయం తెలుచుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే పులిచెర్ల అంకన్నను ద్విచక్ర వాహనంపై ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. అటవీకి సమీపంలోని చెంచు గిరిజనులపై పెద్దపులి దాడి చేయడంతో స్థానిక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అదృష్టవశాత్తు అంక్కన్న ప్రాణాలతో బయటపడడంతో స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద పులుల నివసిస్తున్న అభయారణ్యంలో గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని.. ఆదమరిస్తే తమ ప్రాణాలకే పెనుముప్పుగా మారుతుందని పలువురు ప్రజలు వాపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.