Andhra Pradesh: ఎంత దారుణం..! భార్య పరువు కోసం..

చిన్నపాటి వివాదాలు, క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఉపాధి కోసం పట్టణం వెళ్లిన ఒక వ్యక్తి, తన భార్య గౌరవం కోసం పోరాడి చివరకు సొంత ఊరిలోనే ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్లు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి దారుణ హత్య ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

Andhra Pradesh: ఎంత దారుణం..! భార్య పరువు కోసం..
Kurnool Murder Case

Edited By:

Updated on: Apr 30, 2026 | 4:13 PM

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని గనేకల్లు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం మంగళగిరిలో నివసిస్తున్న హనుమంత రెడ్డి, తన స్వగ్రామంలోని రైల్వే ఉద్యోగి వెంకటేష్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. గనేకల్లు గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి జీవనోపాధి కోసం మంగళగిరిలో నివసిస్తున్నాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ తన భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే, అదే గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి వెంకటేష్, హనుమంత రెడ్డి భార్య గురించి గ్రామస్తుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తున్నాడని బాధితుడు ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ విషయమై నిలదీయడానికి ఈ నెల 28న మంగళగిరి నుంచి గ్రామానికి చేరుకున్నాడు.

అదే రోజు అర్ధరాత్రి హనుమంత రెడ్డి, వెంకటేష్ ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన వెంకటేష్, ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకువచ్చి హనుమంత రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో హనుమంత రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చావుబతుకుల మధ్య ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆదోని ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంత రెడ్డి ప్రాణాలు విడిచాడు. ఆదోని తాలూకా సిఐ నల్లప్ప ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడైన రైల్వే ఉద్యోగి వెంకటేష్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ఆవేశంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. తండ్రి మరణం, తండ్రిలాంటి నిందితుడు జైలు పాలవ్వడం వల్ల ఆ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us