12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా 12 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, అనంతరం కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ప్రత్యేక బృందాలు, వందలాది మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాల నుంచి కిడ్నాప్ వరకు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..
Kakinada Jahnavi Missing Updates

Updated on: Jun 17, 2026 | 9:59 AM

హేమాహేమీ ఆఫీసర్లు రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు…! టెక్నాలజీకి చిక్కట్లేదు…! శాస్త్రానికి అంతుపట్టట్లేదు…! ఒకరోజు మిస్సింగ్ అంటారు..! మరో రెండ్రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు…! యానిమల్ ఎటాక్ ఏమైనా జరిగిందేమోనని కూడా అనుమానించారు…! గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని.. 500 మందితో జల్లెడ పట్టినా జాడ కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు…? పన్నెండు రోజులైనా పట్టుకోకపోవడమేంటి…? ఈ మిస్టరీని ఛేదించేదెలా…? రక్తంపంచుకుని పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది…? గుండె ఆగినంత పనౌతుంది. అలాంటి పన్నెండ్రోజులుగా తన బిడ్డ కోసం గుండెలు బాదుకుంటోందీ తల్లి. ఏమైపోయిందో… ఎటు పోయిందో… అసలు ప్రాణాలతో తిరిగొస్తుందో లేదోనన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో… ఈ తల్లి చూస్తున్న నరకం వర్ణణాతీతం. ఏ తల్లికీ రావొద్దీ కష్టం.

మిస్సైన మొదటి రోజు నుంచి ఇవాళ్టి వరకు పాప కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. మొదట మిస్సింగ్ కేసు అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు కలిసి పోలీసులంతా చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. డే2, డే3 కూడా అదనపు బలగాలను రంగంలోకి దించి… డ్రోన్‌లను ఎగరేసినా ఫలితం దక్కలేదు… పాప దొరకలేదు.

నాలుగోరోజు పాప కథలో మరో ట్విస్ట్. అప్పటిదాకా మిస్సింగ్ మిస్సింగ్ అన్న వాళ్లంతా… ఇది పక్కా కిడ్నాపేనంటూ… మిస్సింగ్ కేసుని కాస్త కిడ్నాప్‌గా మార్చేశారు. జాహ్నవి తల్లి కూడా పాప ఎక్కడికి వెళ్లలేదు… ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆరోపించడం అప్పటిదాకా ఉన్న మిస్సింగ్ కేసు స్వరూపాన్నే మార్చేసినట్టయ్యింది.

రోజులు గడిచేకొద్దీ… మరింత మిస్టరీగా మారుతున్న ఈ కేసులో ఏడో రోజు తర్వాత కొత్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. జాహ్నవి కొండచిలువ బారిన పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు. అలాంటప్పుడు మాత్రమే దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించకపోవచ్చని అభిప్రాయపడటం అందరికి ఆవేదనకు గురిచేసింది. అదిగో వస్తుంది… ఇదిగో వస్తుందనుకుంటున్న తల్లిదండ్రుల బాధను రెట్టింపు చేసింది.

ఇక డే 10 అండ్ డే 11కి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓవైపు ఖచ్చితంగా తిరిగొస్తుందన్న జ్యోతిష్యుడి మాటలు, మరోవైపు పోలీసుల సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో పాప దొరుకుతుందని భావించినా ఫలితం దక్కలేదు.

ఇక పదకొండో రోజు జాహ్నవి అదృశ్యం అయిన ప్రాంతంలో మాంసంతో కూడిన రెండు బొమ్మలను అమర్చి, కెమెరాలు పెట్టారు. ఏదైనా అడవి జంతువు అటువైపు సంచరిస్తూ బొమ్మపై దాడి చేస్తే… కేసుకి ఉపయోగం అవుతుందని భావించి ఈ తరహా ప్రయోగం చేసినా ఫలితం శూన్యం.

సో… ఎన్ని విధాలా ప్రయత్నించాలో అన్ని విధాలా ప్రయత్నించినా జాహ్నవి జాడ దొరకట్లేదు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసుని.. ఆ దేవుడైనా చేధించకపోడా అన్న ఆశతో తల్లిదండ్రులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. గంట గంటకూ గుండెల్లో గుబులు రేగుతున్నా.. ఎక్కడో ఒకచోట పసికూన క్షేమంగానే ఉంటుందన్న ఆశతో తల్లిదండ్రులు దేవుడ్ని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us